Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రుల పని తీరుపై ఆయన నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరపక పోవడం వల్ల, ఆ పేషంట్ అవయవాలు ప్రాణ దానానికి అవకాశం లేకుండా పోతున్నాయని తెలిపారు. జిల్లాలోని టీచింగ్ ఆస్పత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యం అవుతుందన్నారు. దీనిపై కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టివీవీపీ కమిషనర్ అజరు కుమార్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌లు అధ్యయనం చేయాలనీ, త్వరలో జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్దారణ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుండి కార్నియా, గుండె, కాలేయం, లంగ్స్, కిడ్నీలు సేకరించి, జీవన్ దాన్లో రిజిస్టర్ అయి ఏండ్ల కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడవచ్చన్నారు. ఒక్కరి నుంచి సేకరించిన అవయవాలు ఐదుగిరి ప్రాణాలు నిలబెడతాయని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిమ్స్‌లో 70 అవయవ మార్పిడులు జరిగాయని తెలిపారు. గత ఏడాది వంద జరిగాయనీ, ఈ ఏడాది కూడా వందకు పైగా అవయవ మార్పిడి జరిగేలా పని చేయాలని కోరారు.
ప్రజల విశ్వాసం పొందాలి..
ప్రజల విశ్వాసం పొందాలంటే పేషెంట్లకు మంచి వైద్యం అందించాలన్నారు.నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రులకు మన రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తెలిపారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఇక్కడికి వస్తుంటారన్నారు. వారికి మంచి వైద్యం అందించి విశ్వాసం పొందాలని చెప్పారు. నిమ్స్‌లో పరీక్ష ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలనీ, అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెను వెంటనే అయా విభాగాలకు పంపాలన్నారు. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆర్ఎంవోలు చొరవ చూపాలన్నారు. వీరు అన్ని వేళలా పేషెంట్లకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిమ్స్ బెడ్ ఆక్యుపెన్స్ 77 శాతం ఉందనీ, ఇది చాలా తక్కువన్నారు. ఒకపక్క బెడ్స్ లేవని అంటూనే, 27 శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్టు రిపోర్టులో ఎలా పేర్కొన్నారని ప్రశ్నించారు. బెడ్ ఆక్యుపెన్సీ వంద శాతానికి పెరగాలని ఆదేశించారు.
క్యాన్సర్ వ్యాది గ్రస్థులను గుర్తించి చికిత్స అందించాలి..
క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాంప్‌లు పెట్టాలని సూచించారు. వారానికి మూడు క్యాంపులు నిర్వహించి, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఇటీవల ప్రారంబించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా వినియోగించాలని చెప్పారు. అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలనీ, 300 పడకల కొత్త బ్లాక్ పనులు పూర్తయిన నేపథ్యంలో ఫర్నీచర్, పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిడియాట్రిక్ పాలియేటివ్లో దేశానికే ఆదర్శం..
ఎంఎన్జేలో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ పాలియేటివ్ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.