Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షా కమిటీ సిఫారసులను రద్దు చేయాలి : ప్రధాని మోడీకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని రాష్ట్రాల్లోనూ హిందీని బలవంతంగా రుదొద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ సిఫారసులను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి గురువారం నర్సిరెడ్డి లేఖ రాశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంఎస్ వంటి సాంకేతిక విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, నదోదయ పాఠశాలలు వంటి విద్యాసంస్థల్లోనూ బోధన ఇంగ్లీష్ స్థానంలో హిందీ భాషలో తప్పనిసరిగా జరపాలంటూ అమిత్షా కమిటీ సిఫారసు చేసిందని గుర్తు చేశారు. ఇది దేశ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని విమర్శించారు. నియామక పరీక్షల్లో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం స్థానంలో హిందీ పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నాపత్రాలను చేర్చడం దేశంలోని హిందీయేతర రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో హిందీ వాడకం తప్పనిసరి చెయ్యాలనీ, ఉద్యోగుల నియామకాల్లో హిందీ పరిజ్ఞానం తప్పనిసరి చెయ్యాలనీ, దీన్ని పాటించని ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేయాలంటూ సిఫారసులు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో ప్రకటించిన 22 భాషలు అధికార భాషలుగా గుర్తించారని వివరించారు. అందులో హిందీ ఒకటని గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఆ భాషను అందరిపై రుద్దటం దేశ ఐక్యతకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం-2020 అమల్లో భాగంగా ఈ సిఫారసులు చేస్తున్నట్టు ప్రకటించడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రపంచీకరణలో ప్రపంచమే ఒక కుటుంబంగా మారుతున్న పరిస్థితిలో ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా అంతర్జాతీయంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో ఇంగ్లీష్ మాధ్యమం స్థానంలో హిందీ మీడియాన్ని ప్రవేశపెట్టడం తిరోగమనం తప్ప మరొకటి కాదని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమిత్షా కమిటీ సిఫారసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.