Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రక, పర్యాటక ప్రదేశాల వీక్షణకు సదావకాశం
- శని, ఆది వారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా నుంచి ఉదయం 8:30 గంటలకు బస్సులు : టీఎస్ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టూరిస్టులు హైదరాబాద్ నగర అందాలను వీక్షించేందుకుగానూ 'హైదరాబాద్ దర్శిని' పేరుతో తమ సంస్థ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆ బస్సులు శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8:30 గంటలకు రెండు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతాలను 12 గంటల్లో చూపిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో రెండు బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థను ఆదరించాలని ప్రజలను కోరారు. 'హైదరాబాద్ దర్శిని' ప్యాకేజీలకు ఆదరణ పెరిగితే మిగతా రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. చార్జీలు, ట్యూర్ షెడ్యూల్ తదితర అంశాలను వివరించారు. భోజన ఖర్చులను సొంతంగా భరించుకోవాలనీ, అయితే, 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ అందిస్తున్న ఈ సదవకాశాన్ని విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, టూరిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి టీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconline.in ని సందర్శించాలని సూచించారు.
''హైదరాబాద్ దర్శిని'' సిటీ టూర్ ఇలా...
- సికింద్రాబాద్ ఆల్ఫా హౌటల్ నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- ఉదయం 9:00 గంటల నుంచి 10:00 వరకు బిర్లా టెంపుల్ సందర్శన
- ఉదయం 10:30 నుంచి 12 :30 నిమిషాల వరకు చౌల్ మహల్ ప్యాలెస్ సందర్శన
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:45 వరకు పర్యాటక ప్రదేశమైన తారామతి బారదరి రిసార్ట్స్‌లో మధ్యాహ్న భోజనం
- మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 3:30 వరకు గోల్కొండ కోట పర్యటన
- సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు దుర్గం చెరువు పార్కు
- 5:30 నుంచి 6:00 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి సందర్శన
- సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ పార్కు వీక్షణం
- రాత్రి 8:00 గంటలకు తిరిగి బస్సు ఆల్ఫాహోటల్కు చేరుకుంటుంది.
టూర్ ప్యాకేజీ ఛార్జీలు ఇలా..
మెట్రో ఎక్స్‌ప్రెస్ : 1. పెద్దలకు 250 రూపాయలు.
2. పిల్లలకు 130 రూపాయలు.
మెట్రో లగ్జరీ(ఏసీ) : 1. పెద్దలకు 450 రూపాయలు.
2. పిల్లలకు 340 రూపాయలు.