Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిగ్మాపూర్-పెద్దాపూర్ ట్రంపెట్
- పెద్దల భూముల కోసం అలైన్మెంట్ మార్పు
- ఎన్‌హెచ్-65 వెంట 400 ఎకరాల ప్రభుత్వ భూములున్నా..
- 300 ఎకరాల రైతుల పంట భూముల సేకరణ
- సర్వేను అడ్డుకుంటామంటున్న బాధిత రైతులు
త్రిబుల్ఆర్ రాజకీయ రింగులు తిరుగుతోంది. రాజకీయ నేతలు, బడా భూస్వాముల భూములకు డిమాండ్ పెరిగేలా అలైన్మెంట్ మార్చారు. ముందు ఖరారు చేసిన అలైన్మెంట్ కాకుండా మార్పులు చేయడంతో రైతుల పంట పొలాలు పోతున్నాయి. ఎన్‌హెచ్-65 వెంట వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నప్పటికీ వాటిని మినహాయించి రైతుల పొలాల్లోంచే రోడ్డు వేసేందుకు భూ సేకరణకు పూనుకోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
త్రిబుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 350 కి.మీ పొడవు రోడ్డు వేయనున్నారు. ఇప్పటికే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినందున భూసేకరణకు సర్వే కొనసాగుతోంది. ఉత్తర భాగంలో భువనగిరి నుంచి సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్, గజ్వేల్ మీదుగా మెదక్ జిల్లా తూప్రాన్, నర్సాపూర్ నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, సదాశివపేట, కంది వరకు 110 కి.మీ మేర రోడ్డు వేయనున్నారు. ఇందు కోసం 14 మండలాల్లోని 73 గ్రామాల్లో భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రోడ్డు కోసం భూముల్ని సర్వే చేస్తున్నారు. ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్ ఛేంజర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డబుల్ ట్రంపెట్లు 2, సింగిల్ ట్రపెంట్లు 9 ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్-పెద్దాపూర్ సింగిల్ ట్రంపెటు అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకుల భూముల కోసం మార్చడంతో వివాదంగా మారింది.
పెద్దల భూముల కోసం అలైౖన్మెంట్ మార్పు
త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ పనుల అలైన్మెంట్ ఏజెన్సీని కె అండ్ జే సంస్థకు అప్పజెప్పారు. కే అండ్ జే సంస్థ ఏరియల్ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, రైతుల భూములు, కాల్వలు, చెరువులు, నిర్మాణాలను పరిశీలించిన తర్వాతనే అలైన్మెంట్ ఖరారు చేసింది. సంగారెడ్డి సమీపంలో సింగిల్ ట్రంపెట్ (జంక్షన్) ఏర్పాటు కోసం 1, కంది -ఐఐటీ హైదరాబాద్, 2, గిర్మాపూర్-పెద్దాపూర్, 3, పెద్దాపూర్-నందికంది మధ్యన సింగిల్ ట్రంపెట్ వేయాలని అలైన్మెంట్ రిపోర్టు తయారు చేశారు. రెండో ప్రతిపాదనయిన సిగ్మాపూర్-పెద్దాపూర్ వద్ద సింగిల్ ట్రంపెట్ నిర్మించాలని ఫైనల్ చేశారు. ట్రంపెట్‌కు అవసరమైన 40 ఎకరాలతో పాటు 30 కి.మీ పొడవున రోడ్డు వేయడానికి కూడా సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూములు ఎన్‌హెచ్ 65కి ఆనుకుని ఉన్నాయి. దాంతో రైతుల భూములు పెద్దగా సేకరించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. ఈ అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ చేయడం వల్ల అధికార, విపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులకు చెందిన భూములకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇద్దరు మంత్రుల బంధువులకు ఉన్న వందలాది ఎకరాల భూములతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి భూములు కూడా ఉన్నాయి. దాంతో గెజిట్‌లో ముందుగా ఇచ్చిన రోడ్డు మ్యాప్ అలైన్మెంట్ మార్చేశారు. ముందు ఖరారు చేసిన అలైన్మెంట్ 500 మీటర్ల పైకి డిజైన్ మార్చారు. మార్చిన అలైన్మెంట్ ప్రకారం ఎన్‌హెచ్-65 సమీపంలోనే ట్రంపెట్ నిర్మించాల్సి వస్తోంది. 500 మీటర్ల పైకి డిజైన్ మార్చడం వల్ల 300 మంది చిన్న, సన్నకారు రైతుల భూములు రోడ్డులో పోనున్నాయి. పాత అలైన్మెంట్ ప్రకారమైతే ప్రభుత్వ భూమి ఉన్నందున కొద్ది మంది రైతులకే నష్టమేర్పడేది. మార్చిన అలైన్మెంట్ వల్ల రైతుల భూములే కాకుండా వందల సంఖ్యలో నర్సరీలున్నాయి. ఇవన్నీ పోవడం వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా పోతాయని నర్సరీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎన్‌హెచ్ 65పై ముత్తంగి దగ్గరలో రింగ్ రోడ్డు ఉంది. అక్కడి నుంచి త్రిబుల్ ఆర్ సిగ్మాపూర్-పెద్దాపూర్ సింగిట్ ట్రంపెట్ వరకు 25 కి.మీ దూరమే ఉంది. 30 కి.మీ లోపున జంక్షన్ ఉండకూడదని ఎన్హెచ్ఏఐ నిబంధనల్లో ఉన్నప్పటికీ పెద్దల భూముల కోసం అలైన్మెంట్ మార్చడాన్ని విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. అలైన్మెంట్ మార్చడం వల్ల త్రిబుల్ ఆర్ రాజకీయ నాయకులు, భూస్వాముల భూములకు డిమాండ్ పెరుగుద్ది. మరో పక్క పాత అసైన్‌మెంట్‌లో రోడ్డు కోసం పోవాల్సిన ప్రభుత్వ భూములు మిగులుతాయి. ఎన్‌హెచ్ 65ని ఆనుకుని 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నాయి. వీటిని రోడ్డు విస్తరణలో పోకుండా చూడడం ద్వారా తర్వాత విక్రయించవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
ఎకరం రూ.2.50 కోట్లపైనే
సంగారెడ్డి జిల్లా సమీపంలోని భూముల ధరలు మండిపోతున్నాయి. ఐఐటీ హైదరాబాద్, జాతీయ రహదారి, పారిశ్రామికాభివృద్ధి, వేలాది వెంచర్ల విస్తరణ వల్ల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, సదాశివపేట మండలంలోని పెద్దాపూర్, సంగారెడ్డి మండలంలోని చింతలపల్లి, ఇరిగిపల్లి, నాగపూర్, కలబ్గూర్, కులబ్గూర్ గ్రామాల్లోని రైతుల భూముల్లోంచి త్రిబుల్ఆర్ రోడ్డుతో పాటు సింగిల్ ట్రంపెట్ నిర్మిస్తారు. ఈ గ్రామాల్లో 300 ఎకరాల వరకు సేకరించాలని నిర్ణయించారు. ఇక్కడ ఎకరం భూమికి మార్కెట్ ధర రూ.2.50 కోట్లపైనే ఉంది. రెండు పంటలు పండే వ్వవసాయ భూములు తీసుకోనున్నారు. ఒక్కో రైతు అరెకరం, ఎకరం నుంచి మూడెకరాల వరకు భూముల్ని కోల్పోతారు. కోట్ల రూపాయల వి లువ చేసే భూముల్ని తీసుకుని కేవలం కొద్దిపాటి పరిహారం ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రభుత్వం మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరం రూ.6 లక్షల నుంచి రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటోంది.
సర్వేను అడ్డుకుంటాం: బాధిత రైతులు చంద్రమ్మ, బుచ్చయ్య, రమేష్, వెంకట్‌రెడ్డి, నర్సింహ
త్రిబుల్ఆర్ భూ సేకరణ కోసం సంగారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రజాభిప్రాయాన్ని అడ్డుకున్నాం. మొదట చేసిన అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారో.. టెక్నికల్‌గా వచ్చిన ఇబ్బందు లేమిటో.. బహిర్గతం చేయాలి. భూముల్ని సర్వే చేస్తే సహించేది లేదు. అడ్డుకుంటాం. మార్కెట్ ధరలో 50 శాతం పరిహారంగా ఇవ్వడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
పంట భూముల పోకుండా ప్రత్యామ్నాయం చూడాలి: గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
త్రిబుల్ఆర్ కోసం పంట పొలాల్ని కాకుండా ప్రత్యామ్నాయ భూముల్ని సేకరించాలి. పలుకుబడి కలిగిన పెద్ద భూస్వాములు, రాజకీయ నాయకుల భూముల్ని కాపాడటం కోసం సన్న, చిన్నకారు రైతుల్ని రోడ్డున పడేయడం సరికాదు. బలవంతంగా భూసేకరణ చేయడం ఆపేయాలి. రైతుల పక్షాన న్యాయపోరాటం చేస్తాం.