Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న తెలంగాణలోకి ప్రవేశం
- గోదావరి నది బ్రిడ్జిపై అడుగుపెట్టనున్న రాహుల్
- చారిత్రాత్మక చార్మినార్ వద్ద సభ
- మక్తల్‌లో ప్రారంభమై... జుక్కల్ మీదుగా మహారాష్ట్రకు...
- 375 కిలో మీటర్లు నడక : కాంగ్రెస్ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు టీపీసీసీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ నెల 23న కర్ణాటక నుంచి గోదావరి నది బ్రిడ్జి మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ప్రారంభమైన పాదయాత్ర దేవరకద్ర, మహబూబ్‌నగర్, జెడ్చర్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చార్మినార్, బహుదుర్పూరా, గోషామహల్, నాంపల్లి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, నారాయణఖేడ్, జుక్కల్ మీదుగా మహారాష్ట్రకు చేరనుంది. చారిత్రాత్మకమైన చార్మినార్ మీదుగా నెక్లెస్‌రోడ్‌కు చేరుకోనుంది. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడ జరగననున్న సభలో ఆయన ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడు పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలో మీటర్లు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఈ క్రమంలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భారత్ జోడో యాత్రకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీి వేణుగోపాల్ హజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ చరిత్ర కాదనీ, ఇది దేశ చరిత్ర అని చెప్పారు. ఈ పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి దేశం ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల కోసం ఇంతవరకు ఏ నాయకుడు ఇలాంటి సాహసం చేయలేదని తెలిపారు. దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి తరుపున రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి రోజూ 25 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారని వివరించారు. భారత్ జోడో యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సాంస్తృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీలు వేయాలని సూచించారు. రైతులు, ఆశా వర్కర్లు, వివిధ వర్గాలతో రాహుల్ భేటీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం నాటికి రాహుల్ పాదయాత్ర 1000 కి.మీకు చేరుకుంటుందనీ తెలిపారు. పాదయాత్రపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రపై గ్రామ పంచాయతీల్లో గోడ రాతలు రాయాలని కోరారు. గ్రామ గ్రామాన ప్రచార పోస్టర్లు వేయాలని సూచించారు. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక నాయకుడు బాధ్యత తీసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు.