Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోన్, మల్టీ జోన్ స్పౌజ్ బదిలీలు చేపట్టండి : సీఎస్‌కు టీజీవో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న మూడు కరువు భత్యాల (డీఏ)ను దీపావళి కానుకగా విడుదల చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులు (టీజీవో) సంఘం ప్రభుత్వాన్ని కోరింది. వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు పొంది ఏడాదిన్నర కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో టీజీవో సంఘం అధ్యక్షులు వి మమత నేతృత్వంలో ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఏపీ నుంచి తెలంగాణకు శాశ్వతంగా చేసే బదిలీ ప్రక్రియలో కేవలం ఈ రాష్ట్రానికి చెందిన స్థానికుల ఐచ్చికాలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని తెలిపారు. భార్యాభర్తలు ఒకేచోట పనిచేయాలనే నిబంధన ప్రకారం పెండింగ్‌లో ఉన్న జోన్, మల్టీ జోన్ పరిధిలోని స్పౌజ్‌కు సంబంధించి బదిలీల ఉత్తర్వులను జారీ చేయాలని పేర్కొన్నారు. నగదు రహిత చికిత్సను అందించేందుకు ఉద్యోగులు, పింఛనర్లు ఒక శాతం మూలవేతనాన్ని చెల్లించేలా తగు నిర్ణయం తీసుకుని ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, సహాధ్యక్షులు ఎస్ సహదేవ్, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, నాయకులు రాజ్‌కుమార్‌గుప్తా, వి సుజాత, బి వెంకటయ్య, టి లక్ష్మణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.