Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడిన మంగ్తానాయక్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగ్తానాయక్ రూ.50వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భువనగిరి పట్టణంలోని గిరిజన బాలికల హాస్టల్ వార్డెన్ దగ్గర రూ.50 వేల లంచం తీసుకోగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఎసీబీ డీఎస్పీ, నల్లగొండ ఇన్చార్జి శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
భువనగిరిలోని పట్టణంలోని గిరిజన బాలికల హాస్టల్ ఖర్చులకు రూ.లక్ష మంజూరు చేయాల్సి ఉంది. ఈ విషయమై హాస్టల్ వార్డెన్ గత నెల (సెప్టెంబర్)లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్‌ను సంప్రదించారు. లక్షలో తనకు రూ.50 వేలు ఇవ్వాలని మంగ్తానాయక్ అన్నాడు. దీంతో వార్డెన్ రూ.50 వేలు తీసుకొని నల్లగొండలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. లంచం విషయం గురించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా హాస్టల్ వార్డెన్ నల్లగొండ నుంచి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోకి వెళ్లిన వార్డెన్.. మంగ్తా నాయక్‌ను కలిశారు. ఆయన ఆ రూ. 50 వేలను కార్యాలయంలోని బీరువాలో ఫైల్స్ కింద పెట్టమని చెప్పాడు. వార్డెన్ డబ్బులను అక్కడ పెట్టి బయటకి వచ్చారు. బయట ఉన్న ఏసీబీ అధికారులకు డబ్బులు ఎక్కడ పెట్టారో వార్డెన్ చెప్పారు. వెంటనే అధికారులు లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయంతోపాటు నల్లగొండలోని మంగ్తానాయక్ ఇంట్లో ఏసీబీ సీఐలు ఇద్దరు దాడులు నిర్వహించారు. మంగ్తా నాయక్‌ను శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.