Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి : శ్రామిక మహిళా సదస్సులో రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ
నవతెలంగాణ-సిటీబ్యూరో
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ ఆర్.వాణి అధ్యక్షతన 'శ్రామిక మహిళలు - పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు - ప్రభుత్వాల బాధ్యత' అంశంపై గురువారం నిర్వహించిన సదస్సులో రమ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ, భవన నిర్మాణం, రైల్వే కాంట్రాక్టు కార్మికులు, పార్కులు, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ఇంటి పని కార్మికులు, ప్రయివేటు కంపెనీలు, కార్యాలయాలు, మెడికల్ అండ్ హెల్త్, ఆశా, అంగన్వాడీ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమాన పనికి, సమాన వేతనం ఇవ్వకపోగా రాత్రిపూట ఎలాంటి రక్షణ చర్యలేకుండా పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రామిక మహిళల పట్ల ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు, యజమానులు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడం లేదని, నిత్యం లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పని ప్రదేశంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. శ్రామిక మహిళలకు కనీస వేతనం రూ.26వేలు, ప్రతి నెలా పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని కోరారు.
సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ ఆర్.వాణి మాట్లాడారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. 45వ ఐఎల్సీ సిపార్సులను వెంటనే అమలు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, స్కీం వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను అందించాలని కోరారు. చట్టంలో సవరించిన విధంగా ఆరు నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, క్రెచ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రత్యేక టాయిలెట్, విశ్రాంతి గది, ఉచితంగా శానిటరీ ప్యాడ్స్, రుతు క్రమం సమయంలో ప్రత్యేక సెలవులు, అన్ని చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులు శోభ, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.