Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధారి
మద్దతు ధరల చట్టం, కొనుగోలు గ్యారంటీ కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఐక్యపోరాటాలు చేపడుతామని స్పష్టంచేశారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా 2వ మహాసభకు ఆయన హాజరై ప్రసంగించారు. బీజేపీ పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని, పూర్తిగా నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకు పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలే ఈ దుస్థితికి కారణమన్నారు. సంక్షోభం నుంచి రైతన్నలు బయటపడాలంటే కేంద్రం కనీస మద్దతు ధర పెంచి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమగ్ర పంటల బీమాను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడితేవాలని సూచించారు. కార్పొరేట్లు, భూస్వాములకే బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని, ప్రతి రైతుకూ బ్యాంకులు సున్నా శాతం వడ్డీకి లోన్లు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లపు వెంకటేశ్, నాయకులు మోతీరం నాయక్, కమ్మరి సాయిలు,ప్రకాష్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.