Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టాగోష్టిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు రాజకీయ కుట్ర జరుగుతున్నదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్ బీజేపీ, టీఆర్ఎస్ ఉందని అన్నారు. మహిళా అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవకుండా చూసేందుకు అన్ని పక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో విలేకర్లతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. మా మధ్యే పోటీ ఉంటుందంటూ నమ్మబలకడం ద్వారా మునుగోడులో ఆ రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. మునుగోడుతోపాటు నల్లగొండ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. అది కూడా పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను ఓడించడంతోపాటు రెండోస్థానం కూడా రావొద్దనే ఉద్దేశపూర్వకంగానే కారు, కమలం పార్టీలు దూషణలు చేసుకుంటున్నాయని విమర్శించారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే...రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినవారవుతారని తెలిపారు. ఒక ఎకరం ఉన్న రైతుకు వచ్చే రైతుబంధుతో ఆ కుటుంబం ఏడాది మొత్తం బతకలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం, ఆర్థిక సహకారం అందిస్తేనే ఆయా కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. బీజేపీ మతం పేరుతో, టీఆర్ఎస్ ఆశలు చూపి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పది రోజుల సంతోషంతో సంతృప్తి పడతారో, భవిష్యత్తు అభివృద్ధికి దోహద పడతారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.