Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ భూ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి అజరు టిర్కీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన-వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పథకాన్ని అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు అదర్శంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ భూ వనరుల అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అజరు టిర్కీ ప్రశంసించారు. ఈ రాష్ట్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల వారికి నమూనాగా ఉన్నాయని కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రంలో పథకం అమలు తీరుపై దక్షిణాది రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలు తీరు, ప్రగతి, నిధుల ఖర్చు గురించి చర్చించారు. కాంపోనెంట్ వారీగా వివరాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హుకుం సింగ్ మీనా, సంయుక్త కార్యదర్శి ఉమాకాంత్, సీనియర్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సీపీ రెడ్డి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ సింగ్, తెలంగాణ స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్వీ ప్రసాద్, జాయింట్ కమిషనర్ ఎమ్. శేషు కుమార్, తమిళనాడు నుంచి ఆ పథకం నిర్వహణ సీఈఓ అబ్రహం, ప్రతినిధులు ఎస్. మనమల్లి, కె. బాలరాజు కేరళ నుంచి సీఈఓ ఎమ్జీ రాజమాణిక్కమ్, ప్రతినిధి సుధీశ్కుమార్, ఏపీ నుంచి వాటర్‌షెడ్ డైరెక్టర్ పీవీఆర్ఎమ్ రెడ్డి, జాయింట్ కమిషనర్ జనార్ధనరెడ్డి, శశిధర్ రెడ్డి, కర్నాటక నుంచి సీఈఓ ఎమ్వీవీ వెంకటేశ్, డిప్యూటీ డైరెక్టర్ తిమ్మయ్య, ప్రతినిధి ఎల్ఆర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.
పథకం ముఖ్య ఉద్దేశాలు ఇవే..
1. క్షీణించిన సహజ వనరులను సంరక్షించి పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం
2. శాస్త్రీయ విధానం, స్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం
3. సమీకృత పశువుల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచడం
4. గ్రామీణ పేదలలో నిరుపేదలైన వారికి జీవనోపాధి భద్రత కల్పించడం.