Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వానాకాలంలో రైతు పండించిన ప్రతీ గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని చెప్పారు. గురువారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై వ్యవసాయ, పౌరసరఫరాలు, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు. దేశంలో రెండో స్థానానికి చేరామన్నారు. వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. ఇందులో సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని జిల్లా యంత్రాంగం ద్వారా అంచనా వేశామని తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, మాయిచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ధాన్యం రాకుండా విజిలెన్స్‌తో పాటు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఇప్పటికే మిల్లర్ల వద్ద ఉన్న దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగిస్తూ తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోరేజ్ విషయంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నా యాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించే అంశంపై దృష్టి సారించాలప్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, అందుకు రైతులు సైతం సహకరించాలని కోరారు. ఎఫ్‌సీఐ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీని కచ్చితంగా మెయింటైన్ చేస్తున్నందున రైతులు సైతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఎఫ్ఎక్యూ ప్రమాణాలతో తీసుకొని రావాలని సూచించారు.