Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రతిష్ట దిగజారుతోంది. సంస్థ ఆధ్వర్యంలో ఏటేటా పత్తి కొనుగోళ్లు పడిపోతుండటం.. గతేడాది నుంచి కొన్ని జిల్లాల్లో అస్సలు కొనుగోళ్లే చేయకపోవడం.. ఒకవేళ కొన్నా ప్రయివేటు ట్రేడర్లతో పోటీపడలేని దయనీయ స్థితిలో 'తెల్లబంగారు'లోకంలో సీసీఐ చిన్నబోతోంది.
- ప్రయివేటు వ్యాపారులతో పోటీపడని భారత పత్తి సంస్థ
- అధిక వర్షాలతో గణనీయంగా తగ్గిన పత్తి దిగుబడి
- ఎకరానికి 5 క్వింటాళ్లు వస్తే అదే ఎక్కువ
- క్వింటాకు రూ.10వేలకు పైగా ధర ఉంటేనే రైతుకు మేలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత పత్తి సంస్థ (సీసీఐ) రాష్ట్రవ్యాప్త కొనుగోళ్లకు సిద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈనెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 121 మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని, 313 జిన్నింగ్ మిల్లులనూ నోటిఫై చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కచోటా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇప్పుడే కాదు గతేడాది కూడా పలు జిల్లాల్లో సీసీఐ కొనుగోళ్లు సాగలేదు. ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నా.. అధిక వర్షాల వల్ల దిగుబడి పడిపోతుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారీ వర్షాలు, వాతావరణ అననుకూల పరిస్థితులతో 7లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. 3లక్షల ఎకరాల్లో మొక్కలు మురిగిపోవడంతో ఈ ఏడాది పత్తి దిగుబడి గణనీయంగా తగ్గనున్నది. ఎకరానికి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు మురిగిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాట్లు వేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగింది. ఎకరానికి సుమారు రూ. 65వేలపెట్టుబడి అవుతుంది.
మద్దతు ధర రూ.10వేలు ఇస్తేనే రైతుకు ప్రయోజనం
ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.6,380గా సీసీఐ నిర్ణయించింది. దాంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.8,500 పైగా పలుకుతోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో క్వింటాకు రూ.10వేలకు పైగా ధర ఇస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని రైతులంటున్నారు. ఎలాంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. గతేడాది రూ.5వేల నుంచి రూ.12వేల వరకూ ధర పలికింది.
దిగుబడులు ఆశాజనకంగా లేవు కాబట్టి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండవచ్చు. ప్రపంచ వ్యాపితంగా పత్తి దిగుబడి తగ్గింది. దాంతో ప్రయివేటు వ్యాపారులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఆ ధర ఉంటుందో లేదో అన్న అనుమానంతో వచ్చిన కొద్ది మొత్తం దిగుబడిని ముందే ప్రయివేటు వ్యక్తులకు రైతులు అమ్ముకుంటున్నారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ భాగస్వామ్యం నామమాత్రం...
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతియేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కానీ కొనుగోళ్లలో సీసీఐ భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటుంది. గతేడాది ఖమ్మంలో పత్తి సాగు వివరాలు, దిగుబడి, కొనుగోళ్ల వివరాలను పరిశీలిస్తే సీసీఐ నిర్లిప్తత స్పష్టమవుతుంది. 2021లో 2,94,405 ఎకరాలకు 21.60 లక్షల క్వింటాళ్ల దిగుబడి రాగా పంట మొత్తాన్ని ప్రయివేటు ట్రేడర్లు, జిల్లాలోని 8 మార్కెట్ల పరిధిలో రోజుకు 4,380 బేల్స్ సామర్థ్యం ఉన్న 13 జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. 2017లోనూ సీసీఐ కన్నా ప్రయివేటు ట్రేడర్లే అధికంగా కొన్నారు. ప్రయివేటు వ్యాపారులు 16 లక్షల క్వింటాళ్లు కొంటే సీసీఐ 12 లక్షలు మాత్రమే కొన్నది. ఇక ఈ ఏడాది సీసీఐ నుంచి కొనుగోళ్ల ఊసే లేదు. ఇలా ఏటేటా సీసీఐ పత్తి కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పించుకుంటోంది.
సీసీఐకి రైతు శ్రేయస్సుకన్నా.. లాభాలే మిన్న
మద్దతు ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భారత పత్తి సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థే. ఏటేటా పత్తి విస్తీర్ణం పెరుగుతున్నా.. దిగుబడులు పడిపోతున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ దశలో ప్రయివేటు వ్యాపారులకు దీటుగా సీసీఐ రంగంలోకి దిగాలి. సంస్థ లాభనష్టాల విషయాన్ని పక్కనబెట్టి రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలి. కేంద్రం అధీనంలోనే ఉండే ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ఈ ఏడాది 10 నుంచి 50శాతం వరకూ పెరిగిన దృష్ట్యా పత్తికి మరింత ధర లభించేలా సీసీఐ చర్యలు తీసుకోవాలి. కానీ ఆ ప్రయత్నమేదీ చేయకుండా పత్తి సంస్థ పట్టనట్టే ఉండటంతో రైతులు ఆశించిన ఫలితాన్ని పొందలేక పోతున్నారు. ఇప్పటికైనా సీసీఐ రైతుల పెట్టుబడి, దిగుబడులను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధరను పెంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిర్వీర్యం
సీసీఐని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ప్రయివేటు ట్రేడర్లకు దీటుగా పత్తి సంస్థ మార్కెట్లో ఉంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది. కానీ లాభనష్టాలను బేరీజు వేసుకుని రైతుల శ్రేయస్సును కేంద్రం గాలికొదిలేస్తోంది.
- బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు ఉండకపోవచ్చు
గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా సీసీఐ కొనుగోళ్లు ఉండకపోవచ్చు. ప్రయివేటు ట్రేడర్లు మద్దతు ధర కన్నా మించి రేటు పెడుతున్న దృష్ట్యా సీసీఐ రంగంలోకి దిగట్లేదు. మద్దతు ధర కన్నా రేటు తగ్గినప్పుడు సంస్థ ప్రవేశిస్తుంది.
-కోలాహలం నాగరాజు, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి