Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రత్యామ్నాయాలపై కసరత్తు
- 16వ ప్యాకేజీలో రూ.320 కోట్లు ఆదాపై 'ఇరిగేషన్' నివేదిక
- 570 ఎకరాల భూములు సేవ్.. తగ్గనున్న 1.5 కి.మీ దూరం
- రాష్ట్ర ఉన్నతస్థాయి ఇంజినీరింగ్ అధికారుల ఆమోదం
సీతారామ ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీ ప్రాంతాల్లో గతంలో నిర్మించిన నాలుగు ప్రాజెక్టుల్లో రైతులు తమ భూములు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం కోసం కూడా భూసేకరణ చేస్తుండటంతో రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ఖర్చు ఆదా అయ్యేలా, ఇటు రైతులు భూములు నష్టపోకుండా ఉండేలా ఇరిగేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే రంగంలోకి దిగుతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టన్నెల్ అంశం చర్చనీయాంశంగా మారింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరందించే సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్‌కు నీరు మళ్లించాల్సి ఉండగా ఇంకా పనులు పూర్తికాలేదు. కొన్ని ప్యాకేజీల్లో నిర్వాసితులకు పరిహారమే అందలేదు. ఐదారు నెలలుగా 16వ ప్యాకేజీ పనుల్లో సొరంగ మార్గం చర్చకు దారితీస్తోంది. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోని పనుల్లో స్వల్ప మార్పులు చేసి 7.97 కి.మీ పొడవున సొరంగ మార్గం నిర్మిస్తే రూ.300 కోట్ల వరకు ఆదా అవడమే కాకుండా 570 ఎకరాలకు పైగా భూసేకరణ తప్పుతుందని, 1.5కి.మీ దూరం కూడా తగ్గుతుందని జిల్లా ఇరిగేషన్ అధికారులు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఉన్నత అధికారులకు నివేదించారు. దీనికి ఆమోదం లభించినట్టూ చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే సొరంగం పనులు ప్రారంభిస్తామని సీఈ, డీఈలు శంకర్‌నాయక్, రమేష్‌రెడ్డి వెల్లడించారు.
సొరంగం లెక్కలు ఇలా...
తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోని రైతులు ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ, తానంచర్ల, భక్తరామదాసు పథకాలకు భూములు ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులకు భూములు కోల్పోతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఇరిగేషన్ శాఖ యోచించి ఇక్కడి భూములు సొరంగానికి అనువుగా ఉండటంతో ప్రభుత్వానికి నివేదించారు. తెట్టెలపాడు, పాతర్లపాడు, బీరోలు, కూసుమంచి మండలం పోచారం, కూసుమంచి వరకు 14.22 కి.మీ పొడవున కాలువ తవ్వకానికి 864 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. సొరంగ మార్గం వల్ల దీనిలో 570 ఎకరాల భూ సేకరణ తప్పుతుందని లెక్కలు వేశారు. కేవలం 294 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని తేల్చారు. దీనివల్ల రూ.120 కోట్ల విలువైన భూసేకరణ అవసరం లేదని, నిర్మాణాల పరంగా కూడా 38 వంతెనలకు గాను ఆరు బ్రిడ్జీలు నిర్మిస్తే సరిపోతుందంటున్నారు. కాలువ తవ్వితే ఈ ప్రాంతంలో 15 నుంచి 40 అడుగుల లోతులో డెప్త్ ఆఫ్ కటింగ్ ఉన్నట్టు అంచనా వేశారు. ఈ రాయిని తొలగించేందుకు బ్లాస్టింగ్ చేస్తే సమీప గ్రామాలు బీరోలు, పోచారంలో ఇండ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద సంబంధిత ఇండ్లకు నష్టపరిహారం కట్టించాల్సి ఉంటుంది. అదే టన్నెల్ ఏర్పాటు చేస్తే నిర్మాణాలు, వర్క్‌పరంగా కూడా సుమారు రూ.300 కోట్లు ఆదా అవుతాయని లెక్కలు చెబుతున్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు మొదలు బీరోలు, కూసుమంచి మండలం పోచారం (కిష్టాపురం రోడ్డు) వరకు సొరంగం నిర్మించాలని అధికారుల అంచనా.
సొరంగానికి అనుకూల, ప్రతికూలతలు...
16వ ప్యాకేజీ పరిధిలోని సొరంగం విషయంలో నెలకొన్న సందేహాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోని 7.97 కి.మీ పరిధిలో సొరంగం నిర్మించే ప్రాంతంలో ఐదారు మీటర్ల లోతునుంచే రాయి ఉంది కాబట్టి టన్నెల్‌కు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. 150 ఫీట్ల లోతు నుంచి సొరంగం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా భూములు కోల్పోతున్న ఇతర ప్యాకేజీల రైతులు కూడా సొరంగం కోసం డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆయా ప్యాకేజీల్లో ఒకటి, రెండు చోట్ల గుట్టలు అడ్డుపడినా అధికారులు అక్కడ సొరంగానికి ప్లాన్ చేయలేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎలా టన్నెల్ నిర్మిస్తారనే అనుమానం నిర్వాసిత రైతుల్లో ఉంది. ఇప్పటికే 16వ ప్యాకేజీ పరిధిలోని 270 ఎకరాల భూములకు గాను 250 మంది రైతులకు రూ.60 కోట్లకు పైగా పరిహారం ఇచ్చారు. ఆ మొత్తాన్ని రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9% వడ్డీతో తిరిగి నీటిపారుదలశాఖ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సంబంధిత నగదు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల భూములను నీటిపారుదల శాఖ ఆధీనంలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని అంటున్నా.. సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన చిక్కులపై సందేహాలు లేకపోలేదు. తరచూ అలైన్మెంట్ మార్పుపై దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కావేరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్సు ప్రయివేటు లిమిటెడ్ కాంట్రాక్టర్ నుంచి కూడా అభ్యంతరాలు వెలువడవచ్చు. ఇవన్నీ ఒకెత్తయితే 'రైతుల కన్నా గుత్తేదారుల శ్రేయస్సు మిన్న' అని భావించే ప్రభుత్వ పెద్దలు ఏ మేరకు ఈ మార్పులకు అంగీకరించి సొరంగానికి అనుమతిస్తారనేది రైతుల్లో పెద్ద సందేహంగా ఉంది.
ప్రభుత్వం నుంచి అనుమతి కచ్చితం
- శంకర్‌నాయక్, చీఫ్ ఇంజినీర్, ఖమ్మం జిల్లా
ఉన్నతస్థాయి ఇంజినీరింగ్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా కచ్చితంగా అనుమతి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. రైతుల శ్రేయస్సు, ఖర్చు, సమయం ఆదా అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం కచ్చితంగా అనుమతిస్తుంది. కాంట్రాక్టర్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. పరిహారం తీసుకున్న రైతులు తిరిగి ఇవ్వని పక్షంలో భూములు స్వాధీనం చేసుకుంటాం. కూసుమంచిలో పాలిటెక్నిక్ కళాశాలకు కేటాయించిన స్థలం ఈ రకంగా ఇచ్చిందే. ఇతర ప్యాకేజీల్లో డెప్త్ ఆఫ్ కటింగ్ సరిగా లేదు కాబట్టి సొరంగానికి అవకాశం లేదు.