Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు ఏడు గంటలు వేలాడుతూనేే..
- జేసీబీలు, క్రేన్ సాయంతో దించిన పోలీసులు
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారడంతో మోకులో ఇరుక్కుని వేలాడుతూ దాదాపు ఏడు గంటలు నరకయాతన అనుభవించాడు. పోలీసులు, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు జేసీబీలు, క్రేన్, నిచ్చెనల సహాయంతో తీవ్రంగా శ్రమించి చివరకు అతన్ని రక్షించారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెం గ్రామ సమీపంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..శేరిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలగోని మాసయ్య రోజు మాదిరిగా కల్లు తీసేందుకు వీరమల్ల అండాలు వ్యవసాయ పొలంలోని తాడిచెట్టు ఎక్కాడు. సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న తాటిచెట్టు పైకి ఎక్కగానే బీపీ ఎక్కువ కావడంతో ఒక కాలు, చేయి పనిచేయకుండా పోయాయి. దాంతో నడుముకు ఉన్న మోకు సాయంతో చెట్టుపై వేలాడాడు. కొద్దిసేపటి తరువాత తోటి గీత కార్మికులు గమనించి అతన్ని కాపాడేందుకు యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో గ్రామస్తులకు, కుటుంబీకులకు తెలియజేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. ముందుగా అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. స్థానిక గీత కార్మికులతో కలిసి మాసయ్యను కిందకు దింపేందుకు ప్రయత్నించినా ఫలితం లేక క్రేన్లను తీసుకొచ్చారు. ఆ తాటి చెట్టు వరి పొలంలో ఉండటంతో వాహనాలు పోవడానికీ ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు జేసీబీల సమాయంతో క్రేన్‌ను తాటి చెట్టు వద్దకు తీసుకెళ్లారు. క్రేన్, నిచ్చెనలు ఏర్పాటు చేసి దాదాపు ఏడు గంటల తరువాత మాసయ్యను చెట్టుపై నుంచి దించారు. సురక్షితంగా కిందకు దించడంతో కుటుంబీకులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ ఏసీపీ ఉదరురెడ్డి, సీఐ నరేష్, ఎస్ఐ యుగంధర్, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.