Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూటిప్రశ్న
- గ్యాస్ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప...ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?అని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. ఎంతసేపూ కార్పొరేట్లపై కరుణ చూపుతున్నారే కానీ, ప్రజలపై కనికరం చూపట్లేదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ కంపెనీలకు రూ. 22 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన బీజేపీ, ఆడబిడ్డలపై మోపిన రూ.42 వేల కోట్లకు పైగా విధించిన సబ్సిడీల భారంపై ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. సిలిండర్ ధరను సుమారు మూడు రేట్లు చేసి, సబ్సిడీలకి మంగళం పాడిన బీజేపీని తరిమి కొట్టాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. బీజేపీ అంటే...భారమంతా జనంపై మోపే పార్టీ అని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ రూ.22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారని తెలిపారు. గ్యాస్ సిలిండర్‌పై అడ్డగోలుగా సబ్సిడీ ఎత్తేసి జనంపై మాత్రం భారాలు మోపారని విమర్శించారు. మరి ఈ ఆర్థిక భారాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని అడిగారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేదనీ, ఇప్పుడది రూ. 1100 దాటిందని గుర్తుచేశారు. 2014లో కేంద్రం ఒక్క సిలిండర్‌పై రూ. 827 పైగా సబ్సిడీ ఇచ్చేదనీ, ఇప్పుడు దాన్ని మొత్తానికేఏ ఎత్తేశారని చెప్పారు. 2014కి ముందు రూ.400 గ్యాస్ సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపైన నరేంద్రమోడీ విమర్శలు చేశారనీ, ఇప్పుడు మాత్రం దేశ ప్రజలకు ముఖం చాటేస్తున్నారని అన్నారు. దురదష్టవశాత్తు గడచిన రెండేండ్లలో కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో మధ్యతరగతి ప్రజల ఆదాయాలు భారీగా తగ్గాయనీ, అయినా బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచి ఆయా వర్గాలను దోచుకోవడాన్ని మాత్రం ఆపలేదన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అలాంటి సమాంతర ప్యాకేజీ లేదా సబ్సిడీని సిలిండర్ వినియోగదారులకు కూడా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోడీ కావాలో, సబ్సిడీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఇదేనన్నారు. గ్యాస్ బండ పైన సబ్సిడీని అడిగితే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని వెక్కరించినట్లు మాట్లాడడం మధ్యతరగతి మహిళలను చులకన చేసి మాట్లాడటమేనని విమర్శించారు. పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.