Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు శాసనసభ ఉపఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఐద్వా పూర్తి మద్దతు ఇస్తుందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జిట్టా సరోజ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో మహిళలు, పసిపిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు పెరిగిపోయాయని, మోడీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పేద, మధ్యతరగతికి చెందిన కుటుంబాలు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, విమానాలు, గనులు, ఎల్ఐసీ తదితర సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్తున్నారని విమర్శించారు. మహిళల హక్కులపై దాడులు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. బీజేపీని ఎవరు ప్రశ్నించినా వారి గొంతును నొక్కేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాదని మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తుందన్నారు. బీజేపీని ఓడించి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత మాట్లాడుతూ.. తినే ఆహారం, ధరించే దుస్తుల మీద ఆంక్షలు విధిస్తూ మహిళలు ఆలోచించకుండా ఇంటికే పరిమితమయ్యే విధంగా బీజేపీ పాలన ఉందని విమర్శించారు.
సొంత ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ను వదిలి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు పాలడుగు ప్రభావతి, బట్టుపల్లి అనురాధ, జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లాకమిటీ సభ్యులు బత్తుల జయమ్మ, దొడ్ల ఆండాలు, రాపోతు పద్మ, ఎంపీటీసీ తడక పారిజాత, అర్షియా సుల్తానా, వీరమల్ల యాదమ్మ, రేహానా, జయమ్మ, మహేశ్వరి, సత్తమ్మ, ఆండాలు, కవిత, వసంత, సునంద, పుష్ప పాల్గొన్నారు.