Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి :సీఎస్‌కు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ నేతృత్వంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కొంగరకలాన్‌కు మారినందున అక్కడ పని చేసే ఉద్యోగులందరికీ 24 శాతం హెచ్ఆర్ఏను మంజూరు చేయాలని సూచించారు. ఏపీలో పనిచేస్తున్న 123 మంది తెలంగాణ ఉద్యోగులను సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే వెనక్కి తీసుకురావాలని తెలిపారు. సస్పెన్షన్‌లో రెండేండ్లకు పైగా ఉన్న ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పేర్కొన్నారు. నూతన జిల్లాలకు పాత జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలని కోరారు. 317 జీవో అమలు వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలనీ, అందులో భార్యాభర్తల కేసులను పరిష్కరించాలని సూచించారు. పీఆర్సీ ఆమోదం పొంది ఇంకా విడుదలకాని ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం రెండు శాతం చందాతో ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. పీఆర్సీలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి అనామలీస్ కమిటీని వేయాలని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవోకు కార్యాలయాన్ని కేటాయించాలని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండేండ్లకు పదోన్నతి కల్పించాలనీ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని తెలిపారు. బకాయి డీఏలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాష్, సిద్దిపేట అధ్యక్షుడు పరమేశ్వర్, సెక్రటరీ విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు.