Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 480 గ్రామాలు మున్సిపాలిటీలలో కలిశాయి
- పట్టణ కూలీలకు పని లేక ఆర్థిక ఇబ్బందులు
- పట్టణ ఉపాధి హామీ చట్టానికి రూ.1000 కోట్లు కేటాయించాలి :
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-కొమురవెల్లి
మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో మండల ద్వితీయ మహాసభ రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణీకరణ పేరుతో రాష్ట్రంలో 480 గ్రామాలు మున్సిపాలిటీల్లో కలిశాయని తెలిపారు. వారికి ఉపాధి హామీ చట్టం వర్తించకపోవడంతో మూడు లక్షల కుటుంబాలు పనికి దూరమయ్యాయని, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణ ఉపాధిహామీ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చి రూ.1000 కోట్లు నిధులు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. గ్రామాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఉన్నత చదువులు చదువుకున్న పిల్లలు ఉపాధి హామీ చట్టం పనులకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి దళితుల వద్ద ఉన్న వేల ఎకరాల అసైన్డ్ భూములను కేసీఆర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం 500 యూనిట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 300 యూనిట్లు దళిత కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి దళిత కుటుంబానికి 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మికులంతా ఏకమై విద్యా వైద్యం, ఆహార భద్రత, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొంగరి వెంకట్ మావో, రాళ్ల బండి శశిధర్, గొర్రె శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సనాది భాస్కర్, అయినాపూర్ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, రైతు సంఘం నాయకులు బద్దిపడగ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.