Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశోధనా ప్రాజెక్టులు వేగవంతం చేయండి : ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్)లో సంస్థలో సాంకేతిక శిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, పరిశోధనా ప్రాజెక్టుల ఫలితాల వెల్లడిని వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఆదేశించారు. శుక్రవారంనాడాయన డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్ తదితరులతో కలిసి ఇరిసెట్లోని మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, విద్యార్థుల శిక్షణ తదితర అంశాలను స్వయంగా క్యాంపస్‌లో పర్యటించి, సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. లాంగ్ టర్మ్ ఎవాల్యూయేషన్ (దీర్ఘకాలిక మూల్యాంకనం) పరిశ్రమ ఆమోద యోగ్యత పరీక్ష (ఎఫ్ఏటీ) ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వంటి కొత్త సాంకేతిక అంశాలను సమీప భవిష్యత్తులో పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని మరింత త్వరితగతిన పూర్తి చేసేందుకు కావల్సిన సౌకర్యాల వివరాలను అడిగారు. ఆధునీకరించిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించారు. రైల్వేలు, ప్రయివేటు పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరుల నైపుణ్యాలను అందించడానికి ఇరిసెట్లో 'కవచ్' స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన ప్రయోగశాలల్లో కలియతిరిగారు. బీటెక్ విద్యార్థులకు రైల్వే సిగలింగ్, కవచ్ సాంకేతికతలపై ఏఐసీటీఈతో ఉన్న అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు చెప్పారు.