Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో వృత్తిదారుల కోసం సంక్షేమ పథకాలు
- సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దాం : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు ఉపఎన్నికల్లో మతోన్మాద బీజేపీని డిపాజిట్ గల్లంతయ్యే విధంగా చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఆర్కే ఫంక్షన్హాల్లో శుక్రవారం చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం గంజి మురళీధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఎన్నో ఏండ్ల కింద సాధించుకున్న ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. దేశంలో మతవిద్వేషాలను, ప్రజల మధ్య వైరుద్యాలు సృష్టిస్తోందన్నారు. చేతి వృత్తులు, ఆధునీకరణ, ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు, సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి చేతివృత్తిదారులు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గోరింకల నర్సింహ, లెల్లెల బాలకృష్ణ, గొర్రెల, మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, శంకరయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, బడుగు శంకరయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విఘ్నేష్, నాయకులు కొండూరు సత్యనారాయణ, క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.మల్లేశ్, సుధాకర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, మోహన్ పాల్గొన్నారు.