Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగే దొంగ అన్నట్టు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు
- నిజమైన 420లు కోమటిరెడ్డి బ్రదర్సే..
- ఐకెేపీ కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని ఓడించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని, అందులో భాగంగానే మునుగోడులో అధికార టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఎన్నిక ఉండాలనే భావనతో బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల ఆలోచనలు మళ్లించేందుకు మతవిధ్వేషాలు సృష్టిస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులపై రాజగోపాల్‌రెడ్డి విషం చిమ్ముతున్నాడని, రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయాడని విమర్శించారు. నిజమైన 420లు కోమటిరెడ్డి బ్రదర్స్ అని విమర్శించారు. నమ్మిన కాంగ్రెస్‌ను, కన్న తల్లిగా చెప్పుకునే సోనియాగాంధీని మోసం చేసి ఆ పార్టీని నాశనం చేసే బీజేపీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ద్రోహం చేశారన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, మునుగోడులో బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి మాటలను మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఆయకట్టు ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద వేసిన వరి పంట చేతికొస్తుందని, వెంటనే ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, పాదూరి శశిధర్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మక్తాల లింగస్వామి, పాపిరెడ్డి, నంద్యాల కృపాకర్ రెడ్డి, పల్లా భిక్షం పాల్గొన్నారు.