Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్ జిల్లాలో బంగారం కోసమే వృద్ధదంపతుల హత్య
నవతెలంగాణ-ఆర్మూర్
బంగారం కోసం ఓ మైనర్ మరో వ్యక్తితో కలిసి వృద్ధ దంపతులను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనను పోలీసులు చేధించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు నూతన మండల కేంద్రంలో ఈనెల 11న వృద్ధ దంపతులను చంపిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ నాగరాజు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆలూర్లోని వృద్ధ దంపతులు పడిగెల గంగారం, గంగామణి తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో మృతురాలి చెల్లెలు ఆర్మూర్ జమ్మంశెట్టి గల్లీకి చెందిన పల్లె అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతుల దత్తత పుత్రుడు పడిగెల ఓంకార్ అలియాస్ సాయికుమార్ (మైనర్)ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఓంకార్ ఆలూర్ గ్రామానికే చెందిన అన్రాసి వెంకటితో కలిసి పడిగెల గంగారాం, ఆయన భార్య గంగామణిని పథకం ప్రకారం చీరతో గొంతుకు బిగించి హత్యచేసి, వారు ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించినట్టు ఒప్పుకున్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు పుస్తెల తాడు, మాటీలు, కమ్మలు, అలాగే పట్టగొలు సులు తీసుకుని పరారయ్యారు. ఇదిలా ఉండగా.. వెంకటి 2008లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రేప్, మర్డర్, దొంగతనం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలయ్యాడు. కేసును చేధించడంలో కీలకపాత్ర వహించిన ఏసీపీ ఆర్.ప్రభాకర్‌రావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేశ్ బాబు, ఎస్ఐలు ప్రదీప్ కుమార్, శివరాం, ఏఎస్ఐ షేక్ గఫ్ఫార్, కానిస్టేబుల్ గంగాప్రసాద్‌కు రివార్డులు ఇచ్చి అభినందించారు.