Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రొఫెసర్ సాయిబాబా కేసులో హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిసింది. ఆయనను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతోపాటు ఆ కేసులో ఉన్న ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మేధావులను, ప్రజలకోసం పనిచేస్తున్న నాయకుల ను, ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వాలు తప్పుడు కేసులలో ఇరికిస్తున్నదని విమర్శించారు. కనీస పద్ధతులను పాటించకుండా ప్రొఫెసర్ సాయిబాబాను 2017 నుంచి జీవిత కాల ఖైదీగా శిక్షించారని తెలిపారు. 90 శాతం వైకల్యంతో ఉన్న ఆయనకు జైలులో కనీస సౌకర్యాలూ కల్పించలేదని పేర్కొన్నారు. ఆ కేసుతో ఎటువంటి సంబంధం లేదనీ, జైలులో కనీస సౌకర్యాలను కల్పించాలనీ, అతనిని తక్షణమే విడుదల చేయాలని వివిధ సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. గత కొన్నేండ్లుగా తప్పుడు రాజకీయ కారణాలతో వేలాది మందిని అరెస్టు చేసి ఉపా, ఏఐపీసీ కింద నిర్బంధిస్తున్నదనీ, కఠిన శిక్షలకు గురిచేస్తున్నదని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు తీర్పు ఆహ్వానించదగిందని వివరించారు.