Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ 21కి వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రచురణ కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆ పార్టీ వినతిని తోసిపుచ్చింది. మునుగోడు ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమర్పించిన నివేదిక వివరాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని తేల్చింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలివ్వాలన్న బీజేపీ అభ్యర్థనను ఆమోదించలేదని స్పష్టం చేసింది. తుది జాబితాలో కొత్త చేరిన ఓట్ల వివరాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత 70 రోజుల్లో 25 వేల కొత్త ఓట్ల నమోదుకు అప్లికేషన్లు వచ్చాయనీ, ఇదంతా టీఆర్ఎస్ కుయుక్తుల్లో భాగమేనని, దీన్ని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి. ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన రిట్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. అసాధారణంగా కొత్త దరఖాస్తులు వచ్చాయనీ, చిన్న నియోజకవర్గంలో పాతి వేల కొత్త ఓట్లు నమోదైతే దాని ప్రభావం ప్రజా తీర్పుపై ఉంటుందని చెప్పారు. ఇంకా ఖరారు చేయాల్సిన 5 వేల దరఖాస్తులను ఆమోదించకుండా ఈసీకి ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ తరఫు న్యాయవాది డి. అవినాష్ వాదిస్తూ, ఎన్నికలప్పుడు ఆ స్థాయిలో కొత్త ఓట్ల నమోదు సహజమేనని చెప్పారు. పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. 2018 అక్టోబరు 12న మునుగోడులో 2,14,847 ఓటర్లు ఉన్నారని, ఈనెల 11వ తేదీ నాటికి అక్కడ ఓటర్ల సంఖ్య 2,38,759కి చేరిందని తెలిపారు. 25,013 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వాటిలో 12,249 కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పించామనీ, మిగతా 7,247 తిరస్కరించామని చెప్పారు. మరో 5,517 ఫారాలు పెండింగులో ఉన్నాయనీ, వీటిపై పోలింగ్ చివరి రోజు శుక్రవారమే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కొత్త ఓటర్ల నమోదుకు ఇదే స్థాయిలో దరఖాస్తులు వస్తుంటాయని చెప్పారు. ఈసీ నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు వరకు ఓట్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, దీనికి విరుద్ధంగా పిటిషనర్ కోరడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. ఓటర్ల జాబితాలో కొత్త వారి చేరిక ఇప్పటికిప్పుడే జరగలేదని స్పష్టం చేశారు. చట్ట నిబంధనకు విరుద్ధంగా దాఖలైన రిట్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
నీరు కరెంట్ ఇవ్వండి...
దసరా సెలవుల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లకు నీరు, కరెంటు సరఫరా నిలిపివేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తక్షణమే వాటిని పునరుద్ధరించాలంటూ వర్సిటీ రిజిస్ట్రార్‌ను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఆదేశించారు. లా విద్యార్థులు ఎన్. మహేష్ గౌడ్ ఇతరులు వేసిన రిట్‌ను అత్యవసరంగా విచారించారు. ఈ నెల 10 వరకు ఉన్న దసరా సెలవులను 26వరకు పొడిగించారనీ, హాస్టళ్లకు వచ్చిన విద్యార్థులు గ్రూప్ వన్ ఇతర పరీక్షలకు సిద్ధపడుతున్న క్రమంలో నీళ్లు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది వాదించారు. పునరుద్ధరణ చేయకపోతే విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
ఒవైసీకి నోటీసు..
నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో మత విద్వేష ప్రసంగాలు చేశారనే అంశానికి సంబంధించి మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఉన్న కేసును కింది కోర్టు కొట్టేయడాన్ని న్యాయవాది కరుణసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఒవైసీకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసును కొట్టేస్తూ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని పిటిషనర్ వాదన. ఈ కేసుపై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
నిషేధిత భూములపై స్టే...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ సర్వే నంబర్ 63లో 50 ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చడంపై హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమి తమదేనని భక్తియార్ ఖాన్ ఇతరులు వేసిన రిట్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. గతంలోని ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆ భూముల్ని నిషేధిత జాబితాలో ఎలా చేర్చారో తెలియజేయాలంటూ కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.
రాజాసింగ్ రిమాండ్ కొట్టివేతపై అప్పీల్...
శాసనసభ్యుడు రాజాసింగ్ మత విద్వేష ప్రకటనలు చేశారనే కేసుకు సంబంధించిన రిపోర్టును కింది కోర్టు కొట్టేయడాన్ని మంగళహాట్ ఎస్హెచ్ఓ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై అడ్వకేట్ జనరల్ కౌంటర్ గడువు కోరారు. దీంతో పోలీసుల అప్పీల్ పిటిషన్ విచారణ నవంబర్ 11కి వాయిదా పడింది.