Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పద్ధతిలోనే పరీక్షలు
- వెబ్సైట్లో మోడల్ ప్రశ్నాపత్రాలు : నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 2022-23 విద్యాసంవత్సరంలో వందశాతం సిలబస్‌ను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 రెండు విద్యాసంవ త్సరాల్లోనూ 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అంటే 30 శాతం సిలబస్ లేకుండానే ప్రశ్నాపత్రాలను రూపొందించి పరీక్షలను నిర్వహించింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి వందశాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించాలని నిర్ణయించామని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి జూనియర్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయని వివరించారు. వందశాతం సిలబస్‌కు అనుగుణంగా మోడల్ ప్రశ్నాపత్రాలను రూపొందించామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్షిక పరీక్షలతోపాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు చెందిన ప్రశ్నాపత్రాలను www.tsbie.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. కరోనాకు ముందు ఉన్న పాత పద్ధతిలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.