Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోహెడ మార్కెట్ అత్యంత అధునాతనంగా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్క్మాండ్రిడ్( స్పెయిన్),రుంగిస్(ఫ్రాన్స్) వంటి దేశాల మార్కెట్లలో ఉన్న అంతర్జాతీయ అధునాతన వసతులు, ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయనున్నట్టు తెలిపారు. షెడ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు వీలుగా ఫ్రూట్ షెల్ఫ్‌లైఫ్ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం సముదాయంలో నిర్వహించిన కోహెడ మార్కెట్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సమీక్షించారు. మార్కెట్లో వేలం నిర్వహించేందుకు 11 భారీ షెడ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. పండ్లు, ఎండు మిర్చి, ఉల్లిపాయల అమ్మకాల కోసం 820 షాపుల నిర్మాణం చేయడంతోపాటు కోల్డ్‌స్టోరేజీలను నిర్మించాలని ఆదేశించారు. పండ్ల మార్కెట్ కోసం 78 ఎకరాలు, ఎగుమతుల మార్కెటింగ్ కోసం 19.75 ఎకరాలు, ఎండు మిర్చి మార్కెట్ కోసం 27.35 ఎకరాలు, ఇతర వసతులకు 73.24 ఎకరాలు కేటాయించాలని సూచించారు. మలక్‌పేటలోని మిర్చి మార్కెట్‌ను పూర్తి స్థాయిలో బదిలీ చేసేందుకు కోహెడలో అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. మామిడి మార్కెట్‌ను మరింత అభివృద్ధి పరిచేందుకు అవసరమైన వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎగుమతులకు సంబంధించిన సర్టిఫికేషన్ ల్యాబుల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.