Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజల విస్తృత భాగస్వామ్యంతోనే టీబీని నిర్మూలన సాధ్యమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆమె వంద మంది రోగులను దత్తత తీసుకున్నారు. ఆమె స్ఫూర్తితో రాజ్‌భవన్ అధికారులు సాధ్యమైనంత మంది టీబీ రోగులను దత్తత తీసుకుంటామని తెలిపారు. ఆయా ఆరు నెలల పాటు పౌష్టికాహారాన్ని అందించనున్నారు. గవర్నర్ రూ.15 వేలను గ్రాంట్‌గా విడుదల చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె టీబీ సీల్ అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ 2025 నాటికి టీబీ ముక్త భారత్ కోసం కుటుంబాలు, సమాజం సహకరించాలని కోరారు. నిర్దేశించుకున్న లక్ష్యానికన్నా ఒక ఏడాది ముందే టీబీ ముక్త తెలంగాణ కోసం పాటుపడాలని టీబీ అసోసియేషన్ ఆప్ తెలంగాణకు సూచించారు. అక్టోబర్ చివరి నాటికి రోగుల్లో కనీసం 10 శాతం మందికి దాతలు దొరుకుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 28 వేల మందికిగాను 25 వేల మంది దాతలు, సంస్థల సహకారం పొందుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, టీబీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌తో స్వావలంబన
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్‌తో చాలా మందిని స్వావలంబన దిశగా నడిపిస్తున్నదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె ప్లాగ్‌షిప్ బ్యూటీ సెలూన్ బ్రాండ్ ఎఫ్-సలోన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో 75 వేల గుర్తింపు పొందిన స్టార్ట్ అప్ లున్నాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా తదితర పథకాలు ఎక్కువమందిని వ్యవస్థాపకులుగా మార్చాయని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ కళాకారులు, చేతివృత్తుల వారికి ఎక్కువగా ఉపయోగపడిందని తెలిపారు.