Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ ప్రేమికులు, అటవీ ఉద్యమకారులు కలిసి రావాలి
- గిరిజనులు.. ఇతర పేదలను గెంటేసేందుకే ఆ నియమాలు
- ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం
- 'అటవీ సంరక్షణ నియమాల బిల్లు'పై మేధా పాట్కర్
- గిరిజన, ప్రజా, రైతు సంఘాల సమావేశంలో పలు నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాల బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని నర్మదా బచావో ఆందోళన్ నాయకులు మేధా పాట్కర్ పిలుపునిచ్చారు. గతంలో వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సంఘటితంగా ఉద్యమించిన రీతిలో.. అదే తరహాలో ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మేధా పాట్కర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొస్తున్న అటవీ సంరక్షణ నియమాలు-2022 అనేవి కోట్లాదిమంది గిరిజనులు, ఇతర పేదలను అడవుల నుంచి గెంటేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులతోపాటు అక్కడి విలువైన ఖనిజ సంపదను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే వాటిని తీసుకొచ్చారని తెలిపారు. శతాబ్దాలుగా అడవుల్లో జీవిస్తూ పోడు భూములపై ఆధారపడుతున్న ఆదివాసి గిరిజనులు, పేదలకు ఇవి శాపంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ నియమాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు, సభలు, నిరసనలు చేపట్టాలని కోరారు. ఈ ఉద్యమంలో గిరిజనులే కాదు పర్యావరణ ప్రేమికులు, అటవీ సంరక్షణ ఉద్యమకారులు కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మెన్, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ... అటవీ సంరక్షణ నియమాలనేవి షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ఐదు, ఆరు అధికరణలను పూర్తిగా కాలరాసే విధంగా ఉన్నాయని తెలిపారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల గుర్తింపు చట్టం- 2006ను నిర్వీర్యం చేసే విధంగా అవి ఉన్నాయని విమర్శించారు. ఆ నియమాలు అమల్లోకి వస్తే... దేశంలో 45 లక్షల పోడు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిసా చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామ సభలకున్న అధికారాలను రద్దు చేస్తూ జిల్లా స్క్రీనింగ్ కమిటీకి వాటిని కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు. తునికాకు, ఇతర అటవీ ఉత్పత్తులపై నియంత్రణ విధిస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీయడం వల్ల గిరిజనులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు. అంబానీ ఆదానీలకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం అడవులు, అక్కడి ఖనిజ సంపదను వారికి దారాదత్తం చేసేందుకే ఇలాంటి నియమాలను తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో జాగృతి ఆదివాసి దళిత్ సంఘటన్ జాతీయ నాయకురాలు మాధురి, మల్కాన్గిరి ఆదివాసి సంఘ్ నాయకులు బిజరు ఉపాధ్యాయ, ఏఐకేఎమ్ఎస్ జాతీయ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్, ఆదివాసీ నాయకులు కిచ్చల రంగారెడ్డి, ఇండియన్ నేషనల్ మూమెంట్ నాయకులు కృష్ణ ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మనాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అటవీ సంరక్షణ నియమాలు-2022ను తక్షణ ఉపసంహరిం చుకోవాలనీ, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు, గిరిజనులపై కొనసాగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలనీ, ఆ నియమాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ నుండి జనవరి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెమినార్లు, గిరిజన ప్రాంతాల్లో పాదయాత్రలు, నిరసనలు చేపట్టాలనీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు.