Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా రాజగోపాల్‌రెడ్డిని నిలేస్తున్న జనం
- కలిసి రాని లోకల్ కేడర్.. పక్క పార్టీల వైపు చూపు
- పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ప్రజలు
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
''ఇక్కడెక్కడిదయ్యా.. పువ్వు గుర్తు.. మెమెప్పుడు సూడలే.. ఉంటే కమ్యూనిస్టులు.. లేకపోతే చెయ్యి గుర్తు.. తెలంగాణ వచ్చినకానించి కారు గుర్తు.. ఇవే మాకు తెలిసినయ్.. ఆయన ఎక్కడ పోతే అక్కడ ఓటెయ్యాలా.. ఆల్లు అమ్ముడుపోతే మేం ఓటేయాలా..'' మర్రిగూడ మండలం సరంపేట, రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య గొర్రెలు, మేకలను కాస్తున్న ఇద్దరు ఓటర్లను కదిలిస్తే వారి మనస్సులో ఉన్న భావాలను ఇలా చెప్పారు.
ఆ తర్వాత కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఓ యువకుడితో మాట్లాడితే.. ''ఇప్పుడు టీిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. ఎందుకంటే సుమారు 1.50లక్షలకు పైగా టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు అందుకున్న జనం ఉన్నరు.. ఆ రెండింటి మధ్యనే పోటీ... బీజేపీ డబ్చులిస్తే తీసుకున్నా ఆ రెండు పార్టీల వారికే ఓట్లు పడతయ్..'' ఇలా జనం మనస్సును తట్టిలేపితే.. ''వాపు చూసి బలుపు'' అని భావించే మతోన్మాదులు కమ్యూనిస్టుల గడ్డపై కాలుపు మోపాలని కుట్రలు చూస్తున్నారే కానీ సామాన్య జనం మాత్రం వారిని దరిదాపుల్లోకి రానివ్వడానికి సిద్ధంగా లేరని తేటతెల్లమైంది.
పల్లెలకు రావొద్దంటున్న ప్రజలు
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన సందర్భంలో ఆయా గ్రామాల ప్రజలు ఊరికి రావొద్దంటూ అడ్డుకుంటున్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను, పెంచి పెద్ద చేసిన పార్టీని నట్టేట ముంచినోడివి ఏం ఉద్దరిద్దామని తిరిగి ఊర్లోకి వస్తున్నవంటూ నిలదీస్తున్నారు. పెద్ద నాయకులమని చెప్పుకుంటూ ఇతర జిల్లాల నుంచి ప్రచారానికి వచ్చిన నాయకులు కూడా బిక్కమొహంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఐదురోజుల క్రితం చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామస్తులు రోజగోపాల్రెడ్డి రావొద్దని అడ్డుకున్నారు. ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు ఇద్దరూ కోమటిరెడ్డికి మద్దతు తెలిపినా జనం ఐక్యంగా ఉండి తరిమి కొట్టడం గమనార్హం. నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో శనివారం ప్రచారానికెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై.. అప్పటికే కోపంతో ఉన్న యువత ''2018 ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినవ్.. ఇప్పుడు తిరిగి ఓట్ల కోసమే వస్తివి.. మాకేం ఒరగబెట్టినవని వచ్చావు'' అని నిలదీయడంతో.. ప్రచారం చేయనీయకుండానే అక్కడ నుంచి వెనుదిరిగారు. అదే మండలంలోని కోతులారం గ్రామంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్రావు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. అతను కూడా ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. అయితే, రాజీనామా చేశాక గ్రామాల్లో తిరుగుతున్న రాజగోపాల్‌రెడ్డిని చాలా చోట్ల.. ''కాంట్రాక్ట్ పనుల కోసం పార్టీ మారి, ఇప్పుడు ఓటు కోసం వచ్చావు'' అని మొఖం పట్టుకుని ప్రజలు నిలదీశారు.
కలిసి రాని లోకల్ కేడర్
దేశమంతా మునుగోడు ఎన్నికల వైపు చూస్తుందని బీజేపీ చెప్పుకుంటూ.. కోట్ల రూపాయా లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నా నియోజకవర్గంలో ఉన్న లోకల్ కేడర్ కలిసి రావడం లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్య ఓ ఆడియో కూడా విడుదలైంది. ''మొట్టమొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలోనే మనిద్దరం జెండా పట్టుకుని తిరిగాం.. అలాంటి మనకు రాజగోపాల్‌రెడ్డి చేరికతో కనీసం పలకరించే దిక్కులేకుండా పోయింది. ఆయన చుట్టూ వాళ్లకు సంబంధించిన కోటరీ ఉంది. మనల్ని చులకనగా చూస్తున్నారు. డబ్బులు పెట్టి కొన్నోళ్లతోనే ఆయన గెలుస్తాననే ఊహాలోకంలో ఉన్నారు. అదీ చూద్దాం..'' అని ఇద్దరు స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుకున్న ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆ జిల్లాలకు సంబంధించి బీజేపీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే ఈ ప్రాంతంలో కనిపించారు. ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా స్థాయి నాయకత్వం ఎక్కడా ప్రచారంలో కనిపించడంలేదు. రాష్ట్రస్థాయి నేతల్లో కూడా ఐదారుగురు కంటే ఎక్కువ నేతలు ప్రచారంలో కలిసి రావడం లేదని తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారం చేసేందుకు వచ్చిన కొద్ది మంది నాయకులు రెండ్రోజుల ముందే వెళ్లిపోతారు. తర్వాత ఓట్లు వేయించడానికి తామే కదా కావాల్సిందీ.. ఎలా వస్తారో రానివ్వండి చూస్తాం.. అంటూ స్థానిక కేడర్ కస్సుబుస్సుగా ఉన్నట్టు తెలుస్తోంది.