Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వంసిద్ధం చేసిన టీఎస్పీఎస్సీ
- 10.15 గంటలు దాటితే పరీక్షా కేంద్రాల్లోకి నోఎంట్రీ
- 3,80,081 మంది అభ్యర్థుల దరఖాస్తు
- 1019 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ పరీక్షను ప్రశాంతంగా, పటిష్టంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేస్తారు. ఉదయం 10.15 గంటలు దాటితే అభ్యర్థులకు అనుమతి నిరాకరిస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ 1,019 పరీక్షా కేంద్రాలను టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 128 కేంద్రాల్లో 51,718 మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 115 కేంద్రాల్లో 51,931 మంది, హైదరాబాద్‌లో 106 కేంద్రాల్లో 51,851 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో ఏడు కేంద్రాల్లో 1,933 మంది, మెదక్‌లో ఏడు కేంద్రాల్లో 3,293 మంది, నారాయణపేటలో ఏడు కేంద్రాల్లో 2,132 మంది, జయశంకర్ భూపాలపల్లిలో తొమ్మిది కేంద్రాల్లో 2,373 మంది, కామారెడ్డిలో తొమ్మిది కేంద్రాల్లో 4,549 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్, టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ఇప్పటికే పలుసార్లు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, లైజన్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్, వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరీక్షను ప్రశాంతంగా, పటిష్టంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ జారీ చేసిన నిబంధనలు పాటించాలనీ, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 33 జిల్లా కలెక్టరేట్లలోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరి
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావడం తప్పనిసరి (ఉదాహరణకు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి) అని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో మెహందీ టాటూలతో పరీక్షకు హాజరు కావొద్దంటూ సూచించింది. పరీక్షకు అభ్యర్థులు బూట్లు వేసుకుని హాజరు కాకూడదనీ, కేవలం చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని తెలిపింది. వికలాంగులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన సదరం ధ్రువపత్రాన్ని తీసుకుని రావాలని పేర్కొంది. అభ్యర్థులు వాటర్ బాటిళ్లు తెచ్చుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రైటింగ్ ప్యాడ్లను అనుమతించబోమని ప్రకటించింది.
అభ్యర్థులకు మంత్రి సబిత అభినందనలు
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. నోటిఫికేషన్ రాకముందు నుంచి ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా రాయాలని సూచించారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని కోరారు.