Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలమారం కరీం, ప్రశాంత్ నందు చౌదరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఈఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యులు ఎలమారం కరీం, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ నందు చౌదరి ఎన్నికయ్యారు. ఆ సంఘం అఖిల భారత మహాసభలు చండీఘడ్లో ఈ నెల 13 నుంచి 15 వరకు కొనసాగాయి. మహాసభలో సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యుత్ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చిన మోడీ సర్కార్... యాజమాన్యాలకూ పూర్తిగా దాసోహమంటోందని తెలిపారు. రైల్వేలు, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులను ప్రయివేటీకరించిన విధంగానే... విద్యుత్ సంస్థలను కూడా ప్రయివేటీకరించటం ద్వారా దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు వాటిని అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే పుదుచ్ఛేరిలో విద్యుత్ ఉద్యోగులు ఐదు రోజులపాటు వీరోచిత పోరాటం చేసి, చివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిపేసి సంస్థను కాపాడుకున్నారని తెలిపారు. వారి స్ఫూర్తితో ఉధృత ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రజలు, ఉద్యోగులు నష్టపోకుండా చూడాలని కోరారు. మహాసభలో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు మరో 27 మందిని ఆఫీసు బేరర్లుగా ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కార్యదర్శిగా వి.గోవర్థన్తోపాటు వర్కింగ్ కమిటీ సభ్యులుగా కె.ఈశ్వరరావు, వి.కుమారాచారి, ఎన్.స్వామి, సీహెచ్.చంద్రారెడ్డి ఎన్నికయ్యారు.