Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చేందుకు వెనుకడుగు
- భారీగా కోత పడుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన
- ఆదిలాబాద్‌లో రెండో రోజే బోసిపోయిన మార్కెట్
- రోజు వ్యవధిలోనే రూ.40తగ్గిన ధర
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తేమ పేరు వింటేనే రైతులు ఆందోళన చెందు తున్నారు. మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చేందుకే జంకుతున్నారు. తేమ పేరిట ధరలో భారీగా కోత పడుతుందనే ఆందోళనే వారి వెనుకడుగుకు కారణ మవుతోంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన రెండో రోజే మార్కెట్ బోసిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా మార్కెట్లో ఖాళీగా కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రెండో రోజున శనివారం ఒకే పత్తి వాహనం వచ్చినట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడా లేని తేమ నిబంధన ఆదిలాబాద్ మార్కెట్లో అమలవుతుండటం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఓవైపు వర్షాలు కురుస్తుండటం.. మంచు ప్రభావం కారణంగానూ సాధారణంగానే పత్తి తడిగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌కు తీసుకొచ్చిన మేలురకమైన.. తొలిసారి తీసిన పత్తిలోనూ తేమశాతం అధికంగా చూపిస్తుండటంతో రైతుల ఆందోళనకు కారణమవుతోంది. మరోపక్క ఒక్క రోజు వ్యవధిలోనే వ్యాపారులు ధరలో రూ.40వరకు కోత విధించారు.
ఆదిలాబాద్ పత్తి మార్కెట్ ఆసియాలోనే మంచి పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో పండించిన పత్తి మేలు రకమైనది కావడంతో అందరి దృష్టి ఈ మార్కెట్ కొనుగోళ్లపైనే కేంద్రీకృతమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.6380ఉండగా, మార్కెట్లో తొలిరోజు రూ.8300 పలికింది. వరంగల్ మార్కెట్లో కంటే రూ.150 అధికంగా ఉండటంతో తొలిరోజున కొనుగోళ్లు సజావుగా సాగాయి. రెండో రోజు మాత్రం ధరలో రూ.40కోత విధించి.. క్వింటాల్‌కు రూ.8260గా నిర్ణయించడంతో రైతులు దిగాలు చెందారు. ఒక్క రోజు వ్యవధిలోనే ధర తారుమారు కావడం విమర్శలకు తావిచ్చింది. దీంతో మార్కెట్‌కు పత్తి వాహనాలు రాలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8నుంచి 12శాతం వరకు తేమ వస్తేనే పూర్తి ధర చెల్లిస్తారు. అంతకు ఒక్క పాయింట్ ఎక్కువగా వచ్చినా కిలో పత్తి ధర చొప్పున కోత విధిస్తుంటారు. తొలిరోజున పలు పత్తి వాహనాలకు 20 నుంచి 50వరకు తేమ శాతం చూపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ స్థాయిలో తేమ చూపిస్తే మా పరిస్థితేంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తేమతో భారీగా నష్టం..!
పత్తిలో తేమ నిబంధన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8300 ఉండగా.. ఉదాహరణకు 50శాతం తేమ చూపిస్తుండటంతో 12వరకు తేమశాతాన్ని మిన హాయించి మిగతా 38శాతాన్ని పరిగణనలోకి తీసు కుంటారు. ఈ లెక్కన ఒక్కో తేమ శాతానికి కిలో పత్తికి సుమారు రూ.80చొప్పున కోత విధిస్తుంటారు. దీంతో క్వింటాల్ పత్తికి రూ.3040వరకు కోత పడుతుంది. ఈ లెక్కన రైతుకు రూ.5320మాత్రమే దక్కుతుంది. ఇలా క్వింటాల్‌కు రూ.3వేల వరకు నష్టం జరుగుతుండటంతో పెద్ద మొత్తంలో పత్తిని తీసుకొస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు భయపడుతున్నారు. ప్రస్తుతం వాతావరణం సైతం మేఘావృతమై ఉండటంతో ఇంట్లో నిల్వ ఉన్నా తేమ అలాగే ఉండిపోతుంది. ఉదయం ఎండ.. మధ్యాహ్నం చల్లని వాతావరణం ఉండటంతో సహజంగానే పత్తిలో తేమ ఉంటుంది. దీనికి మంచు ప్రభావం కూడా తోడవుతోంది. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడులు తీవ్రంగా నష్టపోయి దిగాలుగా ఉన్న రైతులకు మార్కెట్లో తేమ నిబంధన మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.
తేమ నిబంధనతో చాలా ఇబ్బందులు
పత్తి విక్రయాల సందర్భంలో తేమ నిబంధన విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తొలి పత్తిలో సహజంగానే కొంత తేమ ఉంటుంది. ఇదే అదనుగా తీసుకొని ధరలో భారీగా కోత విధిం చడం సరికాదు. ప్రస్తుతం పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్తే తేమ పేరుతో నష్టం జరుగుతుందనే కారణంగానే కొంత వేచిచూస్తున్నాం. తేమను పరిగణనలోకి తీసుకోకుండా పత్తి కొనుగోలు చేయాలి.
- రైతు వెంకట్రెడ్ది- తలమడుగు