Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డి ఆస్తులు పెరిగితే రైతులవి పెరిగినట్టా..?
- మోటార్లకు మీటర్లు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు : రైతు అవగాహనా సదస్సులో మంత్రి కేటీఆర్
- ఇబ్రహీంపట్నంలో డీసీసీబీ ఆధ్వర్యంలో భారీ సభ
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
ధాన్యం కొనమంటే తెలంగాణ రైతులను నూకలు తినండన్న బీజేపీ ప్రభుత్వం తోకలు కత్తిరించాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. డీసీసీబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో శనివారం వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతు అవగాహనా సదస్సు నిర్వ హించారు. ఈ సదస్సుకు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మెన్లు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంక్షేమ పథకాలను వివరిస్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తూర్పార బట్టారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు 28 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆహార సూచికలో భారతదేశం 116 స్థానానికి పడిపోయిందన్నారు. బీజేపీ పాలనలో రైతు కంట కన్నీరు తప్ప ఏం మిగిలిందని ప్రశ్నించారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగు పడదన్నారు. ఆనాడు రైతు ఆత్మహత్యల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు ముందు భాగంలో ఉండేవని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. తెలంగాణ రాకముందు 68లక్ష టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తే నేడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని గుర్తు చేశారు. పత్తి 40 లక్షల టన్నుల నుంచి 62 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరిందని చెప్పారు. రైతుబంధు ద్వారా రూ.58 వేల కోట్లు అందజేశామన్నారు.
మోడీ ప్రభుత్వంలో రైతుల ఆస్తులు పెరగకపోగా ఆదాని, అంబానీ ఆస్తులు తారాస్థాయికి చేరాయని చెప్పారు. నల్లగొండలో రాజగోపాల్ రెడ్డి ఆస్తులు పెరిగితే సరిపోదని ఆ జిల్లాలోని రైతాంగం అందరి ఆస్తులు పెరగాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్ల డబ్బును నల్లగొండ రైతులకు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని మరోసారి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 46వేల చెరువులను నమ్ముకున్న ముదిరాజులు, బెస్తలకు వలలు, బోట్లు అందజేయడం కోసం రూ.1000 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో కోటీ 30లక్షల ఎకరాల్లో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ ధాన్యాన్ని సేకరించిందన్నారు. తన గొంతులో ప్రాణమున్నంత వరకు రైతుల మోటార్లకు మీటర్లను పెట్టనివ్వబోనని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ తెగేసి చెప్పారన్నారు. కేంద్రం కరెంట్ కంపెనీలను ప్రయివేటుపరం చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలని 13 నెలలపాటు రైతాంగం నిర్వహించిన ఉద్యమాలకు మోడీ తలవంచక తప్ప లేదన్నారు. ఈ క్రమంలో 700 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకే బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతులు పాల్గొన్నారు.