Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారుణ్య నియామకాల్లో కాసుల కక్కుర్తి
- 12 ఏండ్లుగా బాధితుల ఎదురు చూపులు
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కంటోన్మెంట్ బోర్డులో కారుణ్య నియామకాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉద్యోగం ఎప్పుడొస్తుందని ఒకరు.. వయస్సు పైబడుతుందని మరొకరు, చచ్చే వరకైనా ఉద్యోగం వస్తుందా? అని ఇంకొకరు ఇలా ఎదురు చూస్తున్న వారిలో ఒక్కొక్కరిది ఓ ధీనగాథ. ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. మరికొందరి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరించడం లేదు. దీనికి తోడు కొందరు యూనియన్ నేతలు దందాకు తెరలేపారు. కారుణ్య నియామకాలు చేపట్టకుండా ఆటంకంగా మారారనే విమర్శలూ లేకపోలేదు.
దేశంలోనే అతి పెద్దదిగా..
దేశ రక్షణ శాఖలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వీటిలో సివిల్ పాపులేషన్, సొంత నిధులతో పరిపాలన చేస్తున్నవి ఔరంగాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లే. 1798లో నిజాం నవాబు, ఈస్టిండియా కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం మేరకు.. హుస్సేన్‌సాగర్‌కు తూర్పున ఉన్న 13 గ్రామాలను బ్రిటిషర్లకు అప్పగించారు. అందులో ఈస్టిండియా కంపెనీ సైన్యాలతో కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకుంది. 1806లో ఆ ప్రాంతానికి సికింద్రాబాద్‌గా పేరు పెట్టారు. 1945లో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాలను వేరుచేసి సికింద్రా బాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1995లో అది హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైంది. కంటోన్మెంట్ మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్లలో 2.18 లక్షల జనాభాతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతిపెద్దది కావడం గమనార్హం. దీని పరిధిలో 400కుపైగా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డీమ్డ్ మున్సిపాలిటీగా ఉన్న కంటోన్మెంట్లో నిధులు సరిగా లేక అభివృద్ధి పనులు సరిగా జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్మీ ఆంక్షల కారణంగా ఎన్నో ఇబ్బం దులు పడుతున్నామని అంటున్నారు. పరిపాలన, ఇంజి నీరింగ్, హెల్త్ అండ్ శానిటేషన్, వాటర్ నిర్వహణ, వీధి దీపాలు, స్టోర్స్, జనరల్ ఆస్పత్రి, రెవెన్యూ, పన్నుల విభా గాలు ఉన్నాయి. వీటితోపాటు కంటోన్మెంట్ బోర్డు పరిధి లోని ప్రజలకు సేవలందించడానికి 43 కేంద్రాలు ఉన్నాయి.
12 ఏండ్లుగా నిరీక్షణ
కంటోన్మెంట్లో బోర్డులో 2010లో కారుణ్య నియామకాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12ఏండ్లుగా ఏ ఒక్కరినీ విధుల్లోకి తీసుకోలేదు. 72 కుటుంబాలకు చెందిన బాధితులు కారుణ్య నియామకాల కోసం కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. నియామకాలు చేపట్టాలని బాధితులు అనేకసార్లు ధర్నాలు చేపట్టారు. ధర్నా చేసినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు. తర్వాత షరా మామూలుగానే కాలయాపన చేస్తున్నారు. ఈ నియామకాలు చేపట్టకపోవడంతో పేద కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
దందా..!
కారుణ్య నియామకాలు వచ్చేదేమోకానీ దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కంటోన్మెంట్లో కొంత మంది ఉద్యోగులు, స్థానిక నేతలు, యూనియన్ నేతలు పోస్ట్‌కు రేటు కట్టేసి దందా చేస్తున్నారు. ఉద్యోగుల ముందు ఒక మాట, తర్వాత మరొక మాట చెబుతూ బాధితులను తప్పుదోవపట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కారుణ్య నియామకాలను చేపట్టకపోవ డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కారణమైతే.. యూని యన్ నేతలు మరో కారణమని బాధితులు వాపోతున్నారు. డబ్బుల కోసం అమాయకులను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి
కంటోన్మెంట్లో కారుణ్య నియామ కాలను వెంటనే చేపట్టాలి. 12ఏండ్లుగా నియామకాలు చేపట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని నియామకాలు పూర్తిచేయాలి.
- సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్