Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ అవసరాలు, డిమాండ్ ఉన్న వాటిపై అధ్యయనం
- వీసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు
- డిగ్రీ, పీజీ కోర్సులకు కామన్ అకడమిక్ క్యాలెండర్
- డ్రగ్స్ నివారణకు వర్సిటీల్లో కమిటీలు
- వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో వచ్చే విద్యాసంవత్సరం (2023-24)లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మార్కెట్ అవసరాలు, డిమాండ్, ఉద్యోగావకాశాలున్న వాటిపై అధ్యయనం చేసేందుకు వీసీలతో త్రిసభ్య కమిటీని నియమించింది. డిగ్రీ, పీజీ కోర్సులకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వీసీల సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఓయూ వీసీ డి రవీందర్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, తెలంగాణ వర్సిటీ వీసీ డి రవీందర్ గుప్తా, పాలమూరు వర్సిటీ వీసీ ఎల్బి లక్ష్మికాంత్ రాథోడ్, శాతవాహన వర్సిటీ వీసీ మల్లేష్ శంకశాల పాల్గొన్నారు. అనంతరం తనను కలిసిన విలేకర్లతో లింబాద్రి మాట్లాడుతూ డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల పది నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పీజీ కోర్సుల్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ఈనెల 31 నుంచి ప్రారంభమవుతా యని వివరించారు.
డిగ్రీలో కొత్త కోర్సులు, కరిక్యు లమ్, క్రెడిట్లు, గ్రేడింగ్‌కు సంబంధించిన విషయాల పై అధ్యయనం చేసి ఉపాధి అవకాశాలను పెంచే కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని అన్నా రు. అందుకోసం శాతవాహన వర్సిటీ వీసీ మల్లేష్ శంకశాల చైర్మెన్‌గా, ఓయూ, ఎంజీయూ వీసీలు డి రవీందర్, సిహెచ్ గోపాల్‌రెడ్డితో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు, వాటిలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలపై ఆ కమిటీ అధ్యయ నం చేసి నివేదికను సమర్పిస్తుందన్నారు. ఇప్పటికే డిగ్రీలో డేటా సైన్స్, బీఏ ఆనర్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టామనీ, విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని అన్నారు. మాదక ద్రవ్యాలు (డ్రగ్స్), సైబర్ నేరాలను నివారించడం కోసం విశ్వవిద్యాలయాల స్థాయిలో అవగాహన కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. లీగల్ సెల్ అధికారులు, పోలీసు అధికారులు, విశ్వవిద్యాల య అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించారు. యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ను అనుసరించి సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధించేం దుకు వర్సిటీల స్థాయిలో రెండు క్రెడిట్ల కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించామని అన్నారు.