Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ విలువలు కోల్పోతున్నాం : 'అందెశ్రీ' పురస్కార సభలో ఆర్ నారాయణమూర్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారి, కుటుంబ విలువలు దిగజారుతున్నాయని ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ విలువలు కనుమరుగై, మెకానికల్ జీవితంలోకి వెళ్తున్నామనీ, కచ్చితంగా దీన్ని సంస్కరించాల్సిందేనని అన్నారు. విప్లవం అనే మాట వినగానే అదేదో యుద్ధం అనుకుని ఉలిక్కిపడతారనీ, కానీ విప్లవం అంటే సమాజ మార్పే అని చెప్పారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అధ్యక్షతన శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ కి 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం' అందచేశారు. ఈ కార్యక్రమాని కి ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. అంతరిస్తున్న కుటుంబ విలువలు, మానవ సంబంధాలను పునరుజ్జీవింపచేసే ఉద్దేశ్యంతో సుద్దాల అశోక్ తేజ ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నారని చెప్పారు. సుద్దాల హనుమంతు అంటేనే త్యాగం, మానవత్వం అని కీర్తించారు. ప్రజల కోసం స్పందిస్తూ, వారిని చైతన్యపరుస్తూ, జీవితాలను సమాజంతో మమేకం చేయడం సామా న్యమైన విషయం కాదన్నారు. కవి అందెశ్రీ సాహి త్యం బమ్మెర పోతనను గుర్తుకు తెస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలనీ, అదే ఇతివృత్తంతో తాను 'యూనివర్సిటీ' అనే చలన చిత్రం తీస్తూ, దానిలో వైస్ ఛాన్సలర్‌గా నటిస్తున్నట్టు చెప్పారు.పురస్కార గ్రహీత, కవి అందెశ్రీ మాట్లాడు తూ ప్రపంచానికి మతం అనేది ప్రధమ దరిద్రం అయితే, భారతదేశానికి కులం అనే మరో రాచపుండు కూడా ఉన్నదని అన్నారు. వీటిని త్యజిస్తేనే సమాజ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు.కులం, మతం అనేవి ఎలాంటి శాస్త్రీయత లేని అంశాలన్నారు. జానపద వాంగ్మయంకు గుర్తింపు ఇవ్వాలనీ, ఇప్పటి అనేకమంది కవులు వాటికే తోకలు కత్తిరించి, తమ స్వీయ రచనలుగా ప్రచారం పొందుతున్నారని విమర్శించారు. సమాజంలో అన్నార్తులకు రిజర్వేష న్లు ఉండటం తప్పు కాదనీ, కానీ దాన్నే బిచ్చంగా మార్చుకొని బతికేవాళ్లను చూస్తే సిగ్గేస్తున్నదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీందర్ మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. అందెశ్రీ రాసిన ఏడు నదుల పుట్టుపూర్వోత్తరాల పుస్తకానికి నోబెల్ బహుమతి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కవి, కాళోజీ అవార్డు గ్రహీత రామోజీ హరగోపాల్, సాహితీ విమర్శకులు డాక్టర్ బెల్లి యాదయ్య, హైకోర్టు న్యాయవాది ఎమ్ విప్లవకుమా ర్, నన్నయ్య యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్‌లర్ ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అందెశ్రీ దంపతులకు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అందచేశారు. అనంతరం సుద్దాల గ్రామ వాస్తవ్యులు బత్తిని ఐలన్న గౌడ్ దంపతులను కూడా సత్కరించారు. కార్యక్రమ ప్రారంభంలో పాడిన సినీ గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.