Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియను వెంటనే చేపట్టాలి : టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి, డి శ్రీనివాస్, పి.నారాయణమ్మ, పాతూరి మహేందర్ రెడ్డి, ఆత్రం భుజంగరావు, రాష్ట్ర కార్యదర్శులు కడారి భోగేశ్వర్, గుంటి ఎల్లయ్య, రావుల రమేష్, ఎస్.కవిత, ఎస్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. పాఠశాలల్లో ఒకవైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరోవైపు పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పెండింగులో ఉన్న టీచర్ల మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, సప్లమెంటరీ బిల్లులు, సరెండర్ లీవ్ తదితర బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అర్థిక శాఖను డిమాండ్ చేశారు.