Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కోర్టులో టీఆర్ఎస్ పిటీషన్ దాఖలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలంటూ టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోవడంతో, దానిపై న్యాయపోరాటం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం హైకోర్టులో టీఆర్ఎస్ న్యాయ విభాగం పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యింది. దీనిపై శనివారమే న్యాయమూర్తి ఇంట్లో అత్యవసరంగా హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని కోరగా హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. బ్యాలెట్ పేపర్లో కారును పోలిఉన్న కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను తొలగించాలని కోరుతూ ఈనెల 10న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ కోరింది. కారును పోలిన గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురై, టీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారనీ, అందువల్ల ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయనీ, దానివల్ల తమ అభ్యర్థులు ఓటమి పాలైనట్టు ఆపార్టీ విశ్లేషిస్తున్నది. పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్ధులకు ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగిందనే వివరాలతో కోర్టును ఆశ్రయించనున్నారు.