Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ పోరాటంలో విజయం టీఆర్ఎస్ పార్టీదే
- మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
- రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్ ఛాంబర్ తరపున మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం
- మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం :
రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్స్ ఛాంబర్ చైర్మెన్ రాజు వెన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పచ్చని మునుగోడులో బీజేపీ విషం చిమ్ముతోందని రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్స్ ఛాంబర్ చైర్మెన్ రాజు వెన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర మున్సిపల్ చైర్మెన్స్ ఛాంబర్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆదివారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ చైర్మెన్ రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీని దెబ్బకొట్టి మునుగోడు ఉపఎన్నికలో 50వేలకుపైగా మెజార్టీతో ఘనవిజయం సాధిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణానికి వెళ్లి చైర్మెన్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న క్రమంలో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, ఉచిత విద్యుత్తు, ఇంటింటికి నల్ల నీళ్లు, సాగునీరు వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని, రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానం వల్ల విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, ఎన్నో పరిశ్రమలు ఏర్పడుతున్నాయని అన్నారు. కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని, అకారణంగా ఉప ఎన్నికలకు కారణమయ్యారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని, ఆ పార్టీలో నిత్యం కొమ్ములాటలే ఉంటాయని విమర్శించారు. కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే ఉప ఎన్నికల్లో దీటైన అభ్యర్థిగా ఉన్నారని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మెన్లందరూ ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. గ్రామగామాన తిరిగి కేటీఆర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో చోటు చేసుకున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ప్రతి గ్రామం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందనుందో వివరిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మున్సిపల్ చైర్మెన్లు పాల్గొన్నారు.