Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-గోదావరిఖని:
సింగరేణి యాజమాన్యం రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీఓ నెంబర్ 22ను గెజిట్ చేసి కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రామికభవన్లో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కృష్ణయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.ముత్యంరావు, మధు హాజరై మాట్లాడారు. యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి 18రోజులు సమ్మెలో పాల్గొని హక్కులు సాధించుకున్న కార్మికులకు విప్లవ అభినందనలు తెలిపారు.
సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక వివాదాల చట్టంలోని 12(3) సెక్షన్ ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం లేబర్ అధికారుల సమక్షంలో అగ్రిమెంట్ చేయడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 22ను సింగరేణిలో అమలు చేసుకుంటామని స్వయంగా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓను గెజిట్ చేయాలని కోరారు. 7వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సెక్షన్లలో అందడంలేదని వెంటనే యాజమాన్యం కలుగజేసుకుని వేతనాలు సమయానికి అందేలా చూడాలన్నారు. పెండింగ్లోఉన్న సీఎంపీఎఫ్ చిట్టీలు, ఏరియర్స్ ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ 26న జరిగిన ఒప్పందంలోని 12అంశాలకు సంబంధించిన సర్క్యూలర్లను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని కోరారు. కొన్ని కార్మిక సంఘాలు ఒప్పందాన్ని తప్పుపడుతూ కార్మికులను గందరగోళ పరుస్తున్నారన్నారు. ఇలాంటి చౌకబారు పనులు మానుకోవాలని, ఉనికిని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయొద్దని సూచించారు. కార్మికుల పక్షాన నిలబడి చర్చల్లో జరిగిన నిజాలు చెప్పాలి కానీ అబద్దాలు చెప్పడం కాదని తెలిపారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కార్మికులకు నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. అగ్రిమెంట్ అమలు కోసం జరిగే పోరాటంలో కార్మికులందరూ ఐక్యంగా కలిసి రావాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమారస్వామి, నాయకులు కె.రాజయ్య, ఎ.ఓదెలు, డి.శ్రీను, వి.కుమారి, సిహెచ్.అరవింద్, బి.శ్యామ్, ఎస్.ఐలయ్య, జి.శ్రీను, ఎం.చంద్రశేఖర్, రాణి, కళ, సమ్మయ్య, వి.రవి, రహీం, తదితరులు పాల్గొన్నారు.