Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులతో చెలగాటం ఆడుతున్న బీజేపీ
- సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం
చేయండి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
కార్మికుల పక్షాన ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్న క్రియాశీలక సంస్థ సీఐటీయూ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సిద్దిపే టజిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలో సీఐటీయూ జాతీయ మహాసభలు జరగనున్నట్టు తెలిపారు. అంతకుముందే డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో సిద్దిపేటలో సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. చారిత్రాత్మక పట్టణమైన సిద్దిపేటలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను కార్మికులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ కార్మికులను యజమానుల ముందు కట్టు బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. కార్మిక వర్గం కొట్లాడి తెచ్చుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లుగా విభజించిందని విమర్శించారు. బీజేపీ పాలనలో కార్మిక శ్రమ శక్తికి విలువ లేకుండా పోతోందన్నారు. కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. ప్రకృతిపరంగా వచ్చిన సంపదను ప్రయివేటు కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతోందన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట అమలు కాలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాట ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, ఎల్లయ్య, శశిధర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.