Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో కొనుగోళ్లపై స్పష్టత కరువు
- స్థలం లేక రోడ్లపైనే ఆరబెడుతున్న రైతులు
- ఆకస్మిక వర్షాలతో కోతలకూ తీవ్ర ఇబ్బందులు
- నానా అవస్థలు పడుతున్న సోయా రైతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట తర్వాత సోయానే ప్రధాన పంట. రైతులకు ఈ పంటను పండించడం ఓ ఎత్తైతే.. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడం.. మార్కెట్లో విక్రయించడం మరో తీవ్రమైన సమస్యగా మారుతోంది. ప్రస్తుతం పంట ఇంటికొచ్చినా..
విక్రయించేందుకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు పూర్తయిన పంటను ఇంట్లో నిల్వ ఉంచుకోలేక.. రోడ్లపై ఆరబెడుతున్నారు. ఆకస్మికంగా రోజూ ఏదో ఒక సమయంలో కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ సమయంలో వర్షం వస్తుందో తెలియక తాడిపత్రిలతో పంట కుప్పల దగ్గరే పగలు, రాత్రి కాపలా కాస్తున్నారు. మరోపక్క అనేక చోట్ల సోయా కుప్పలు పంట పొలాల్లోనే ఉండటంతో వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. హార్వెస్టర్ వంటి యంత్రాలు బురద కారణంగా ఆయా పొలాలకు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటను కనీసం కాపాడుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది సుమారు 90వేల ఎకరాల్లో సోయా పంట వేయగా ఎకరానికి 5క్వింటాళ్ల చొప్పున సుమారు 4.50 లక్షల క్వింటాల్ వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఈ పంటను కేంద్రప్రభుత్వం క్వింటాకు రూ.4300 మద్ధతు ధర నిర్ణయించింది. కానీ ప్రయివేటులో మాత్రం క్వింటా రూ.4900 నుంచి రూ.5వేల వరకు పలుకుతున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం తేమశాతం అధికంగా వస్తుందనే ఉద్దేశంతో ప్రయివేటులోనూ కొనుగోళ్లు ప్రారంభం కానట్టు తెలుస్తోంది. కానీ ప్రతి ఏటా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్లో కొనుగోళ్లపైనే రైతులు ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ ఈ ఏడాది దాదాపు 70శాతం పంట ఇంటికొచ్చినా మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కోతలు పూర్తయినా పంటను ఇంటికి తీసుకొచ్చిన రైతులు ఆరబెట్టడానికి స్థలం లేకపోవడంతో ఆయా గ్రామ సమీపంలోని రోడ్లపై ఆరబెడుతున్నారు. అక్కడే కుప్పలుగా పోసి కాపలాగా ఉంటున్నారు. వారం రోజుల నుంచి రోజులో రెండు, మూడు దఫాలుగా వర్షం వస్తుండటంతో పంటను కుప్పలుగా చేయడం.. తాడిపత్రిలతో కప్పేస్తున్నారు. మిగితా పనులు మానుకొని కేవలం సోయా పంటను కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తున్నారు.
కొనుగోళ్ల కోసం ఎదురుచూపు..!
పంట రైతుల ఇంటికి రాగానే మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించాలి. కానీ రెండేండ్లుగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కిందటేడాది కొనుగోళ్లు ఆలస్యం చేయడం మూలంగా అనేక మంది రైతులు ప్రయివేటులో విక్రయించారు. అక్కడ తూకాల్లో తేడాలు, తేమపేరుతో కోత విధించడం.. కంటాల్లో మోసాలు జరుగుతున్నా గత్యంతరం లేని పరిస్థితిల్లో విక్రయించాల్సి వచ్చింది. మరోపక్క కొందరు రైతులు మార్కెట్‌కు తీసుకురాకుండా నేరుగా ఆయిల్ మిల్లులకే తీసుకెళ్లినట్టు సమాచారం. కొందరు దళారులు కూడా నేరుగా కొనుగోలు చేసినట్టు తెలిసింది. కిందటేడాది మార్కెట్లో కంటే బయటి జీరో దందానే అధికంగా జరిగినట్టు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకే వంతపాడినట్టు ఆరోపణలున్నా యి. కొనుగోళ్లు జరగకపోవడంతో మార్కెట్‌కు రావాల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది సైతం సోయా కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. ఇదే పంటతో పాటు ఇంటికొచ్చిన సోయాను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే అఖిలపక్ష రైతు సంఘం నాయకులు మార్కెట్లో సోయా కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు - శ్రీనివాస్, మార్కెటింగ్‌శాఖ ఏడీ, ఆదిలాబాద్
మార్కెట్లో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాం. సోయా పంట కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. అక్కడ్నుంచి అనుమతి రాగానే మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం
సోయ పంట ఇంటికొచ్చినా స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే ఆరబెడుతున్నాం. మరికొంత పంట కుప్పలు పొలంలోనే ఉండిపోయాయి. వర్షాలు పడుతుండటంతో బురద కారణంగా పొలాల్లోకి హర్వేస్టర్ వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో పండించిన పంటను కాపాడుకోవడం కోసం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. వర్షాల కారణంగా పగలు, రాత్రి సోయా కుప్పల దగ్గరే కాపలాగా ఉంటున్నాం. ప్రభుత్వం వెంటనే మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలి.
-నాగార్జునరెడ్డి, రైతు, పెండల్వాడ