Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
రోజురోజుకు ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఎన్నికల నామినేషన్లు, స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ పర్వం చివరిదశకు చేరింది. ఆఖరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 130మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు వేయగా.. పూర్తిస్థాయిలో అధికారులు స్క్రూట్నీ చేయగా.. అందులో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా ప్రస్తుతం 83మంది బరిలో ఉన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గానే పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే వారిలో బరిలో ఉండేదెవరో.. ఊడేదెవరోననే.. ఆలోచన అందరిలో ఉత్కంఠను కలిగిస్తుంది.
నేడు నామినేషన్ల ఉపసంహరణ...
దాదాపు 83 మంది అభ్యర్థులు ఎన్నికల నియామళి ప్రకారం నామినేషన్ల దరఖాస్తులు చేసినట్టు, వారికి అర్హులుగా ప్రకటిస్తూ అధికారులు శనివారం రాత్రి ఆలస్యంగా ప్రకటించారు. నామినేషన్లు వేసిన వారిలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన అభ్యర్థులున్నారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో సాగు, తాగు నీరందించాలనే డిమాండ్‌తో జలసాధన సమితి ఉద్యమ సమయంలో సుమారు 540 నామినేషన్లు దాఖలు చేశారు. నాడు ప్రజలు ఓ న్యాయమైన డిమాండ్‌ను సాధించేందుకు ఆ ప్రయత్నం చేశారు. కానీ దానికి భిన్నంగా నేడు మునుగోడులో నామినేషన్ల పర్వం సాగిందనే పలువురు చర్చించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి ఎంతో కొంత ఆశించి నామినేషన్లు వేసినట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థులంతా పోటీలో ఉంటే అధికారులకు కొంత తలనొప్పి తప్పదనే భావన కూడా వస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు ఏ పార్టీకి చెందిన అభ్యర్థి కూడా ఇండిపెండెంట్లను పలకరించకపోవడంతో వారు కూడా ఆయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి సాయితేజరెడ్డి ఉపఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఇంటిపేరుతో గుర్తులు కేటాయిస్తే పువ్వు గుర్తును పోలిన గుర్తే అతనికి వస్తే పరిస్థితి ఏంటని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఆయన్ను బుజ్జగిస్తున్నట్టు తెలిసింది.
ఎంతమంది పోటీలో ఉన్నా..
మునుగోడు ఉపఎన్నికల బరిలో ఎంత మంది పోటీలో ఉన్నా.. పోరులో త్రిముఖ పోటీయే అనే చర్చ జోరుగా సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కంటే ముందు టీఆర్ఎస్, బీజేపీ అనే చందంగా వాతావరణం కనిపించింది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో పువ్వు గుర్తంటేనే గుర్తించే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. కారణం.. బీజేపీ అభ్యర్థి తాను చీల్చే ఓట్లన్నీ కాంగ్రెస్‌కు సంబంధించినవే. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఓట్లు కూడా బీజేపీకి దక్కే వాతావరణం కనిపించడంలేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడులయ్యే నాటికి ఆ పరిస్థితి లేదు. ఎన్నికల విధులు నిర్వహించే ఓ పోలీసు అధికారి పది రోజుల కింద అన్న మాటలు.. ఆయన మాటల్లో.. 'కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసే నాటికి మంచి ఊపుమీద ఉండే. కానీ పూర్తిగా ఆయన హవా పడిపోయింది. జాకీల మీద జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు'' అని స్పష్టంగా చెప్పారు. ఏదిఏమైనా అధికార పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని క్షేత్రస్థాయిలో ఓటర్లు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది.