Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లీం మైనార్టీల సమావేశంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వక్ఫ్ బోర్డుకు చట్టపరమైన అధికారాలివ్వాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లీం మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మెన్ సయ్యద్ ముక్తార్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులతో పాటు పలువురు ఆ వర్గానికి చెందిన మేధావులు పాల్గొన్నారు. వక్ప్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి ఆస్తులను కాపాడాలని కోరారు. ఇప్పటికే కబ్జాలకు గురైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ముస్లీంలకు 100 గజాల చొప్పున పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు ముస్లీంల రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకోవాలనీ, ఇప్పటికే ప్రమాదంలో పడిన నాలుగు శాతం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లీం సబ్ ప్లాన్‌ను తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డుకు శాశ్వత సీఈవోను నియమిస్తేనే ఆస్తుల పరిరక్షణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడుతూ మునుగోడుకెళ్లి ముస్లీం వ్యతిరేక పార్టీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషనర్ మాజీ సభ్యులు ఎం.ఎ.సిద్ధిఖీ మాట్లాడుతూ త్వరలోనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఇనాయత్ అలీ బాక్రీ, బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఊరుకుంటే సరిపోదని సూచించారు. భారతీయులుగా రిజర్వేషన్లడగడం ముస్లీంల హక్కనీ, పాలకులెవరే దానితో సంబంధం లేకుండా పోరాటాలతో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిదేనని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుకోవడం సాధ్యమవుతుందన్నారు. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు రిజర్వేషన్ల పెంపు కన్నా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడేందుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తారిఖ్ ఖాద్రి, టీడీపీ నాయకులు మహమ్మద్ జహీరుద్దీన్ సమర్, మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఉపాధ్యక్షురాలు ఫరీసా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.