Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి
- ఏ ఊరికెళ్లినా కాంగ్రెస్ శ్రేణుల అడ్డగింత
- అంతుచూస్తానంటూ కాంగ్రెస్నాయకునికి బెదిరింపు
- తమను పట్టించుకోవట్లేదని బీజేపీని వీడుతున్న పాతోళ్లు
- కిషన్‌రెడ్డి ప్రచారం...ఆ పార్టీ మండలాధ్యక్షులు టీఆర్ఎస్లోకి
- బీజేపీ చండూరు మండల సర్పంచ్‌లు అధికార పార్టీలోకి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏ ఊరికెళ్లినా ఏముంది ఘనకార్యం..అడుగడుగునా అడ్డగింతలమయం..నిలదీతల పర్వం అన్నట్టుగా బీజేపీ మునుగోడు అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి తయారైంది. సొంత నియోజకవర్గం కాకపోయినా పార్టీమీద అభిమానంతో గత ఎన్నికల్లో రేయింబవళ్లు కష్టపడి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఆయన్ను నేడు ఊరూరా నిలదీస్తున్నాయి. సమాధానం చెప్పుకోలేని నైరాశ్యస్థితిలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి...ప్రశ్నించినోళ్లపై తన నోరు పారేసుకుంటున్నారు. ఆయన తీరు నచ్చక పాత బీజేపీ శ్రేణులు గమ్ముగా ఉండటం...పార్టీనీ వీడటం కూడా కోమటిరెడ్డిని కలవరపాటుకు గురిచేస్తున్నది. చండూరు మండలానికి చెందిన ఐదుగురు సర్పంచ్‌లు పువ్వును విసిరేసి కారెక్కడం రాజగోపాల్‌రెడ్డికి తీరని నష్టమే.
కిషన్‌రెడ్డి ప్రచారం...బాలరాజుగౌడ్ రాంరాం...
మునుగోడు మండలం పలివెలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేయడానికి వెళ్లగా..అదే సమయంలో బీజేపీ మండలాధ్యక్షులు, ఆ గ్రామ సర్పంచి గజ్జెల బాలరాజు గౌడ్ ఆ పార్టీకి రాంరాం చెప్పేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు పెంబళ్ల జానయ్య, కె.నర్సింహ్మ, తదితరులు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో కారెక్కేశారు. పలివెల స్వయానా ఈటల రాజేందర్ అత్తగారు ఊరు కావడం గమనార్హం. ఆయన పార్టీ వీడటానికి రాజగోపాల్‌రెడ్డి అనుచరుల అత్యుత్సాహమే కారణమనే విమర్శా ఉంది. మండల కేంద్రంలో గత నెలలో జరిగిన సన్నాహక సమావేశంలో 'నేను మండలాధ్యక్షున్ని. నాకేం చెప్పకుండా చేయడమేంటి? అసలీ కొత్తోళ్ల పెత్తనమేంటి? మేం ఇన్నేండ్ల నుంచి పార్టీలో ఉంటున్నందుకు ఇచ్చే గౌరవమిదేనా?' అంటూ తీవ్ర అసహనంతో బాలరాజుగౌడ్ మైకును విసిరేసిన విషయం విదితమే.
చండూరు మండలంలో ఐదుగురు సర్పంచ్‌లు..చౌటుప్పల్‌లోనూ
ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న బీజేపీకి చెందిన ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే క్రమంలో ఆయన వెంట ఆ పార్టీలోకి వెళ్లిన చండూరు మండలానికి చెందిన ఐదుగురు సర్పంచ్‌లు(బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్) తాజాగా కారెక్కారు. చౌటుప్పల్ మండలంలోనూ రోజురోజుకీ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయి. పాతోళ్ల, కొత్తోళ్ల మంధ్య సంధి కుదరక ఎవరోఒకరు పార్టీని వీడుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ మండలంలోని తూప్రాన్‌పేటకు చెందిన బీజేపీ కార్యకర్తలు పదుల సంఖ్యలో టీఆర్ఎస్లో చేరటం పరిస్థితికి అద్ధం పడుతున్నది.
ఊహించని రీతిలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి ప్రతిఘటన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తన వెంటే నడుస్తున్నారనే రాజగోపాల్‌రెడ్డి అతి నమ్మకం ఆయన్ను నట్టేట ముంచుతున్నది. 'ఎక్కడో వ్యాపారం చేసుకునే నీకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీని కష్టకాలంలో నడిరోడ్డున పడేస్తావా? పార్టీ నీ కుటుంబానికేం అన్యాయం చేసింది?' అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏ ఊరికెళ్లినా అడుగడుగునా అడ్డుతగులున్నారు. నారాయణపురం మండలంలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి రాజగోపాల్‌రెడ్డికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. 'మమ్ముల్ని వాడుకుని మోసం చేశావు' అంటూ గుజ్జ, కోతులారం, కొత్తగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారానికి వచ్చిన అయన్ను నిలదీశారు. ఏ గ్రామానికెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక ఆయన తీవ్ర నైరాశ్యానికి గురై తన అక్కసుకు, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. 'ఒరేరు గనం అంజయ్య ఏమనుకుంటున్నవ్? చల్ నీ సంగతి చూసుకుంట నా కొడుకా' అంటూ నారాయణపురం మండలం కొత్తగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్‌పై తన నోటిదురుసుతనాన్ని పడేసుకున్నారు. మునుగోడు మండలం సోలిపురం, చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేయడం రాజగోపాల్‌రెడ్డికి నిద్రపట్టనీయటం లేదు.