Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
- 8 రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి
- ఆ తర్వాతే ప్రాథమిక కీ విడుదల : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష విజయవంతంగా ముగిసింది. 33 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 1019 పరీక్షా కేంద్రాల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు 503 పోస్టులకుగానూ 2,86,051 మంది అభ్యర్థులు పరీక్షరాసినట్టు, 75 శాతం హాజరు నమోదైనట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కు మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,42,954 మంది హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకుని 2,86,051 మంది హాజరయ్యారని ప్రకటించారు. అన్ని జిల్లాల నుంచి పూర్తి సమాచారం అందాక వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అభ్యర్థులను గుర్తించడం, భద్రత, తనిఖీ, వివిధ ప్రక్రియల్లో అభ్యర్థులను సులువుగా గుర్తించేందుకుగానూ బయోమెట్రిక్ విధానం అమలు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తలెత్తే ఇబ్బందులు, అభ్యర్థులు, ఇన్విజిలేటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా కమాండ్, కంట్రోల్ సెంటర్ పనిచేసిందని పేర్కొన్నారు. పరీక్ష పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 61 మంది అధికారులను నియమించామనీ, బయోమెట్రిక్ ద్వారా తంబింగ్ సేకరణ, పరీక్ష నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేశామని తెలిపారు. ఎనిమిది పని దినాల్లో ఓఎంఆర్ షీట్ల సాన్కింగ్ ప్రక్రియను పూర్తిచేస్తామనీ, తదనంతరమే ప్రాథమిక కీ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దానిని టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన ఔఔఔ.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ లో పొందుపరుస్తామని తెలిపారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కలెక్టర్లు, అడిషన్ కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, చీఫ్ సూపరిండిండెంట్లు, లైజాన్ ఆఫీసర్లు, అధికారులు, సిబ్బందికి టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి.జనార్ధన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి 10:15 గంటల వరకు అనుమతించారు. సెంటర్లలోకి సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తేకుండా కట్టడి చేశారు. ఒక్కో సెంటర్లో మూడు, నాలుగు చోట్ల తనిఖీలు చేశాకగానీ లోనికి పంపలేదు. బయోమెట్రిక్ పరికరాల వద్ద తంబింగ్ ప్రక్రియ సందర్భంగా కొంత సమయం వెచ్చించాల్సి వచ్చింది. కొందరి ఫింగర్‌ప్రింట్స్ సరిగా రిసీవ్ చేసుకోకపోవడంతో మూడు, నాలుగు సార్లు చేయాల్సి వచ్చింది. పరీక్ష హాల్లోకి అభ్యర్థులను కనీసం చెప్పులు కూడా వేసుకెళ్లనివ్వలేదు. ఒకసారి లోనికెళ్లాక బయటకు రానివ్వలేదు.
సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రశ్నపత్రం
సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రశ్నపత్రం తయారు చేశారనీ, కొన్ని ప్రశ్నలు చదవడానికే ఎక్కువ సమయం పట్టడంతో ఇబ్బంది ఎదుర్కొన్నామని పలువురు అభ్యర్థులు వాపోయారు. రెండున్నర గంటల సమయం ఇచ్చినప్పటికీ 150 ప్రశ్నలు చేయలేని పరిస్థితుల్లో పేపర్ ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రశ్నలు అడిగారని శిఖర అకాడమీ డైరెక్టర్ దీపికా రెడ్డి తెలిపారు. పొడవైన ప్రశ్నలు ఇవ్వడంతో ఇబ్బంది పడ్డారనీ, చాలా మంది అభ్యర్థులు అన్ని ప్రశ్నలు చేయలేకపోయారని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోపు కనీసం 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేక మిగిలిపోయిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ నుంచే వచ్చాయని పేర్కొన్నారు.