Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రులు ఎన్నో వాగ్దానాలిచ్చి విస్మరించారు
- బీజేపీపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎమ్సీ ఎలక్షన్లలోనూ బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు ప్రజలకు ఎన్నో హామీలిచ్చారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గుర్తు చేశారు. వాటిలో ఏ ఒక్క దాన్నైనా అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఆయా ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రులు సైతం అనేక వాగ్దానాలిచ్చి విస్మరించారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మునుగోడులో అదే రీతిలో ఆ పార్టీ నేతలు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. నల్ల్లగొండ అంటేనే చైతన్యానికి ప్రతీక, ఇది విప్లవాల గడ్డ... అందువల్ల బీజేపీ మోసాలను అక్కడి ప్రజలు గమనిస్తారు, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పీయూసీ చైర్మెన్ ఏ.జీవన్‌రెడ్డి, ఎంపీ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులతో కలిసి హరీశ్ మాట్లాడారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో ప్రధాని మోడీ వారికి క్షమాపణలు చెబుతూ... అనేక హామీలనిచ్చారని గుర్తు చేశారు. వాటిని ఇప్పటి వరకూ అమలు చేయలేదని విమర్శించారు. అదే తరహాలో ఇప్పుడు మునుగోడులో కూడా అబద్ధపు వాగ్దానాలతో గెలిచేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా గెలవాలనుకోవటం వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రూ.మూడు వేల పెన్షన్ ఇస్తామంటూ చెప్పారని గుర్తు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఆ మేరకు పింఛన్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు మునుగోడులో సైతం పింఛన్‌పై అదే వాగ్దానం చేస్తున్నారని తెలిపారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పింఛన్ రూ.750 కూడా ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు. అలాంటిది బీజేపీ నేతలు తెలంగాణలో రూ.మూడు వేల పింఛన్ ఇస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీహెచ్ఎమ్సీలో బండి పోతే బండి, కారు పోతే కారు ఇస్తామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఎంతమందికి బండ్లు, కార్లు ఇచ్చారో చెప్పాలంటూ నిలదీశారు. అందువల్ల బీజేపీ అంటేనే మోసం, అబద్ధాలనే విషయాన్ని గ్రహించాలంటూ మునుగోడు ఓటర్లకు మంత్రి పిలుపునిచ్చారు.