Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెట్ ఫలితం వచ్చినా.. తప్పని నిరీక్షణ
- హోమ్ ట్యూషన్లతో కాలం వెళ్లదీత
- ఆందోళనలో ఆశావహులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన రజని బీఎస్సీ, బీఈడీ పూర్తిచేసింది. భర్త ప్రయివేటు ఉద్యోగి కాగా.. ఈమె ప్రభుత్వ పాఠశాలలో ఐదేండ్ల పాటు విద్యావాలంటీర్‌గా పనిచేసింది. కరోనాతో పాఠశాలల మూతబడటంతో సర్కారు వీవీల సేవలను రెన్యూవల్ చేయలేదు. అప్పటినుంచి ఇంటి వద్దే ఉంటూ టీఆర్టీ కోసం ప్రిపేర్ అవుతోంది. భారమైన రూ.15వేలు వెచ్చించి కోచింగ్ సైతం పూర్తిచేసింది. ఇటీవల వెలువడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో పేపర్-1లో 91శాతం, పేపర్-2లో 90శాతం మార్కులు సాధించింది. కుటుంబ పరిస్థితి అంతంతగానే ఉందని, త్వరగా ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించాలని వేడుకుంటుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ వీవీల సేవలను పునరుద్ధరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
హైదరాబాద్ నగరానికి చెందిన బాబు బీఎస్సీ బీఈడీ పూర్తిచేశాడు. టెట్‌లో 79శాతం మార్కులు సాధించి అర్హత పొందారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా కోచింగ్ వెళ్లకుండానే కొద్దినెలలుగా ఇంటివద్దే ఉంటూ టీఆర్టీ కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రయివేటు ఉద్యోగం చేస్తే.. ప్రిపరేషన్‌కు అటంకం కలుగుతుందని హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చినకాడికి భార్య, ఇద్దరు పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు ఆరు నెలలుగా ఖాళీగానే ఉంటున్నానని, కుటుంబ పోషణకు ఆర్థిక భారమవుతున్న.. ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే.. తమకు ఎంతో ఊరట ఇచ్చినట్టేనని వివరించాడు.
తెలంగాణ ప్రభుత్వం 2017లో తొలిసారి ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8,792 పోస్టుల భర్తీకి ఒకే చెప్పగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో 417 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. ఇక అప్పటినుంచి అంటే దాదాపు అయిదేండ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతవరకు దానిపై ఆలోచన కూడా చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను నింపుతామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర ప్రభుత్వ శాఖల్లోని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దశలవారీగా విడుదల చేస్తున్న సర్కారు.. పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ముందుడగు వేయడం లేదు. ఈ ఏడాది జూన్‌లో టెట్ పరీక్ష నిర్వహించగా.. టెట్-1,2 కలిపి రాష్ట్రవ్యాప్తంగా 5.69లక్షల మంది రాయగా.. హైదరాబాద్ జిల్లాలో 46,400 రాశారు. ఇందులో 2.28లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇక నగర పరిధిలో సుమారు 25వేల మంది ఉంటారని తెలిసింది.
ఆశగా చూస్తున్న 4.50 లక్షల మంది అభ్యర్థులు
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో 13,086 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాన్ టీచింగ్ పోస్టులు పక్కనపెడితే.. మిగిలిన వాటిలో 11 వేల వరకు టీచర్ పోస్టులుంటే, వాటిలోనూ ఎస్జీటీ పోస్టులు 6402 వరకు, ఎస్ఏ పోస్టులు 3600కుపైగా ఉన్నట్టు సమాచారం. అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం రాష్ట్రంలోని అన్ని బడుల్లో కలిపి సుమారు 21వేల వరకు టీచర్ పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో 682 ప్రభుత్వ బడులు ఉండగా.. 1,17,503 మంది విద్యార్థులున్నారు. దాదాపు 800కుపైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉండగా.. ఇందులో సోషల్(తెలుగు)లో 124 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా, జీవశాస్త్రం(ఉర్దూ) 95, లాంగ్వేజ్ పండిట్లు 166, ఎస్జీటీ పోస్టులు 616 ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. వీటిన్నింటిని కొంత కాలంగా సర్కారు భర్తీ చేయడంలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఖాళీలకు సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎస్ఏ, ఎసీజీటీ, భాషా పండితులు, పీఈటీలు అన్ని కలుపుకుని మొత్తం జిల్లాలో 400 పోస్టుల వరకే ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. మరోవైపు టీచర్ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 4.5లక్షల మంది అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.