Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓంకార్ వర్ధంతి సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని ఓడించేందుకు బలమైన ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించారు. ఓంకార్ చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి మతోన్మాద సంస్థలు ప్రజలను విభజిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో సామాన్యుల మీద దాడి చేస్తున్నదని చెప్పారు. మనువాద భావజాలంతో ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన సాగిస్తున్నందు వల్లే బీసీ కులగణన చేపట్టడం లేదని అన్నారు. అందుకే బీసీలు నష్టపోతున్నారనీ, చట్టసభలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓంకార్ సామాజిక ఉద్యమ స్ఫూర్తితో సామాజిక తరగతుల అభివృద్ధికి మరిన్ని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీని నిలువరించేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సామాజిక పోరాటాలతోనే వెనుకబడిన తరగతులు చట్ట సభలకు వెళ్లాలని ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా బహుజన ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వెనుకబడిన సామాజిక తరగతులపట్ల అన్ని విధాలుగా వివక్ష ఉందన్నారు. అందుకే బీసీ కులగణన చేపడితే వారు అభివృద్ధి చెందేందుకు అవకాశాలుంటాయని చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మెన్ నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ అనేక ఏండ్లుగా మనువాద భావజాలం దేశంలో వ్యాపించిందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు సామాజికంగా వెనుకబడిన తరగతులకు ఏమీ చేయడం లేదన్నారు.
సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే వరకూ చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ భారతదేశం ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడుతున్నదని విమర్శించారు.
కానీ బీజేపీ, టీఆర్ఎస్ వంటి ప్రభుత్వాలు ఉప ఎన్నికల ద్వారా కోట్లాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని అన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, తుకారం నాయక్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జి మల్లేష్, మైదంశెట్టి రమేష్, టి అనిల్ కుమార్, భద్రబోని పురుషోత్తం, తాండ్ర కళావతి, అంగడి పుష్ప, ఈ కిష్టయ్య, బి సుజాత తదితరులు పాల్గొన్నారు.